తెలంగాణ టూరిజం కార్పొరేషన్ బ్రాండ్ అంబాసిడర్ గా దేత్తడి హరికను నియమించిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె నియామకంపై వివాదం చెలరేగుతుంది. ఈ నేపథ్యంలో హరికకు తెలంగాణ ప్రభుత్వం ఉహించని షాకిచ్చింది. పర్యాటక శాఖ ఆమె వివరాలను వెబ్సైట్ నుంచి తొలగించింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ పర్యాటక భవన్ లో కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ ఛైర్మెన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా హరిక ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్టుగా ప్రకటించారు. అందుకు సంబందించిన పత్రాలను కూడా అందించారు. ఈ విషయాన్ని తెలంగాణ టూరిజం డిపార్ట్మెంట్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
తనను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకున్నందుకు హారిక తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలిపింది. ఇదిలా ఉండగా ఈ అంశంపై ఇప్పుడు వివాదం మొదలైంది. రాష్ట్రానికి పేరు తెచ్చిన ఎంతో మంది మహిళలు ఉండగా ఒక యూట్యూబ్ స్టార్ ను, బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన హరికకు ఈ బాధ్యతలు అప్పగించడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అయితే ఇదంతా టూరిజం కార్పొరేషన్ ఛైర్మెన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా అత్యుత్సాహం వల్లనే జరిగిందనే చర్చ నడుస్తుంది. పర్యాటక మంత్రి శ్రీనివాస గౌడ్ తో పాటుగా సీఎంవో అధికారులకు సమాచారం ఇవ్వకుండానే హరికను బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తూ శ్రీనివాస్ గుప్తా తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఈ విషయాన్ని రాష్ట్ర సర్కార్ తీవ్రంగా పరిగణించింది. ఈ విషయమై శ్రీనివాస్ గుప్తా నుంచి వివరణ కోరినట్టుగా సమాచారం.