కరోనా వైరస్ ప్రభావం, ఎంత శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నాయని గుర్తించేందుకు జరిపే సీరో సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రిసెర్చ్ – నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ కలిసి తెలంగాణలో నాలుగో విడత సీరో సర్వే నిర్వహించాయి. ఒక్క డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 78.5 శాతం యాంటీబాడీలు వృద్ధి చెందాయని ఈ సర్వేలో వెల్లడైంది.
రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఏకంగా 94 శాతం యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయని తేలింది. ఈ సర్వే ప్రకారం కరోనా వ్యాక్సిన్ అద్భుతంగా పని చేస్తున్నాయని స్పష్టమైంది. తెలంగాణలో 60.01 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు ఉన్నాయని కూడా ఈ సర్వేలో వెల్లడైంది. కరోనా నుంచి కోలుకున్న వారిలో, కరోనా వ్యాక్సిన్లు తీసుకున్న వారిలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయి.
యాంటీబాడీలు ఉన్న వారిలో కరోనా వైరస్ను జయించే రోగ నిరోధక శక్తి బలోపేతం అవుతుంది. అంటే, తెలంగాణలో 60.01 శాతం మందికి కరోనాను జయించే బలమైన రోగ నిరోధక వ్యవస్థ ఉందని అర్థం చేసుకోవాలి. 2020 నుంచి ఇప్పటివరకు తెలంగాణలో నాలుగుసార్లు సీరో సర్వే జరిగింది. 2020 మేలో జరిగిన సర్వేలో కేవలం 0.33 శాతం మందిలో మాత్రం యాంటీబాడీలు ఉన్నట్లు తేలింది.
అదే ఏడాది ఆగస్టులో జరిపిన సర్వేలో 12.2 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నాయని వెల్లడైంది. గత డిసెంబర్లో జరిగిన సర్వేలో 24.1 శాతం మందికి కరోనా యాంటీబాడీలు ఉన్నట్లు తేలింది. తాజాగా 2021 జూన్లో జరిపిన నాలుగో విడత సీరో సర్వేలో ఏకంగా 60.01 శాతం మందిలో యాంటీబాడీలు ఉన్నాయని గుర్తించారు. తెలంగాణలోని జనగామ, నల్గొండ, కామారెడ్డి జిల్లాల్లో ఈ సీరో సర్వే జరిగింది.
నాలుగు విడతల్లోనూ ఈ మూడు జిల్లాల్లోనే సీరో సర్వే చేశారు. ఇవే జిల్లాల్లో ఎప్పటికప్పుడు సర్వే చేస్తుండటం వల్ల వైరస్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు కచ్చితమైన అవకాశం ఉంటుంది. ఈ జిల్లాల లెక్కలనే రాష్ట్రం మొత్తానికి వర్తింపజేసి రాష్ట్ర పరిస్థితులను అంచనా వేస్తారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగాన్ని మరింత పెంచాలని ఈ సర్వే చేసిన ఎన్ఐఎన్ సంస్థ ప్రభుత్వానికి సూచించింది.