logo

  BREAKING NEWS

బిగ్ బాస్ – 5 కంటెస్టెంట్స్ ఫైన‌ల్ లిస్టు ఇదే  |   ఈ సినిమాతోనే.. వేణు రీఎంట్రీ  |   రేవంత్ రెడ్డి తెచ్చిన జోష్‌.. కాంగ్రెస్‌లోకి బిగ్ బాస్ కంటెస్టెంట్‌  |   రామ‌ప్ప‌కు యునెస్కో గుర్తింపు.. ఇప్ప‌టివ‌ర‌కు మ‌న దేశంలో, ఏపీ, తెలంగాణ‌లో ఎన్ని గుర్తించారో తెలుసా ?  |   కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారికి సూప‌ర్ న్యూస్‌  |   అస‌లు మ‌న‌లో వ్యాక్సిన్ ప‌ని చేస్తుందా ? తెలంగాణ‌లో స‌ర్వే  |   ఈసారి ప‌వ‌న్ పోటీ ఇక్క‌డి నుంచే ? గెలుపు ప‌క్కా  |   ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్‌కు డేట్ ఫిక్స్‌  |   స్వంత ఇలాఖాలో రేవంత్‌కు షాక్‌  |   ఇదేం ప‌ని.. ఐదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు స్కూళ్ల‌లోనే కండోమ్‌లా ?  |  

132 ఏళ్ల ఘన చరిత్ర.. రాచరిక ఠీవి.. కాలగర్భంలోకి తెలంగాణ సచివాలయం

శతాబ్దానికి పైగా పాలనలో సేవలందించిన ఆ భవనం ఇక కనిపించదు. 132 ఏళ్ళ చరిత్ర గల తెలంగాణ సచివాలయం కాలగర్భంలో కలిసిపోనుంది. 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వ భవనాలకు ఆధునీకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి అధికారిక నివాసం అయిన క్యాంపు కార్యాలయానికి కూడా మార్పులు చేసారు. దానికి ప్రగతి భవన్ గా నామకరణం చేశారు. నిజాం కట్టడమైన సచివాలయ భవనాన్ని కూడా పూర్తిగా తొలగించి ఆ స్థానంలో అసెంబ్లీ, సచివాలయాన్ని కలుపుతూ ఇంటిగ్రేటెడ్ భవనంగా రూపొందించాలని ప్రయత్నించారు. దానికోసం హైదరాబాద్లో అనేక ప్రాంతాలను పరిశీలించిన అనంతరం చివరకు ఇప్పుడున్న సచివాలయ భవనాన్ని కూల్చివేసి అక్కడే కొత్త నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. నిజాం కాలం నాటి కట్టడమైన ఈ చారిత్రక సౌధాన్ని కూల్చడానికి కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

కేవలం వాస్తు కోసమే కేసీఆర్ సచివాలయాన్ని మార్చాలని అనుకుంటున్నారని ప్రతిపక్షాలు విమర్శించాయి. అయినా అవేమీ పట్టించుకుకూడా కేసీఆర్ ప్రభత్వం ముందుకెళ్లింది. పాత భవనాన్ని కూల్చివేసి తెలంగాణ రాష్ట్రానికి కొత్త సచివాలయాన్న ఏర్పాటు చేస్తామని పట్టుబట్టింది. కాగా సచివాలయం కూల్చివేతను వ్యతిరేకిస్తూ కొందరు హై కోర్టులో పిటిషన్లు వేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వందల కోట్ల ప్రజా ధనం దుర్వినియోగం అవుతుందని వాదించారు. దీంతో ఏడాది కాలంగా ప్రభుత్వం దీనిపై పోరాటం చేయాల్సి వచ్చింది. తాజాగా పాలనా పరమైన ప్రభుత్వ నిర్ణయాలలో జోక్యం చేసుకోలేమని తెలిపిన హై కోర్టు సచివాలయం కూల్చి వేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. న్యాయపరమైన అడ్డంకులు తొలగడంతో ప్రభుత్వం సచివాలయ కూల్చివేతను ప్రారంభించింది. దీంతో 132 ఏళ్ల చరిత్రగల నిజాం కట్టడం నేలకూలనుంది. నిజాం నవాబులు కాలంలో ఈ ప్రాంతాన్ని సైఫాబాద్ గా పిలిచేవారు. అప్పుడు నిర్మించిన ఈ సచివాలయ భవనం సైఫా బాద్ ప్యాలెస్ గా ప్రసిద్ధి పొందింది. 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్యాలెస్ నుంచి హుసేన్ సాగర్ కనిపించేలా అద్భుతంగా నిర్మించారు.

1888లో సైఫాబాద్ ప్యాలెస్‌ను ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీపాషా తన నివాస గృహంగా నిర్మించాలనుకున్నాడు. లండన్ నగరంలోని బకింగ్‌హామ్ ప్యాలెస్ నమూనాలో ఇది ఉండాలని ఆయన భావించాడు. ప్రసుతం రాష్ట్ర సచివాలయంలోని ‘జి’ బ్లాకే సైఫాబాద్ ప్యాలెస్. సచివాలయానికున్న ప్రధాన ద్వారాలు, ఎత్తైన నీలి రంగు ఐరన్ గేట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ గేట్లను తలపిస్తాయి. అయితే ప్రధాన రహదారిపై వచ్చిపోయే భారీ వాహనాల దృష్ట్యా ఈ గేట్లు దాదాపుగా మూసివేశారు. ఆరో నిజాం ఈ ప్యాలెస్‌లో ఒక్కరోజు కూడా ఉండకపోవడం విశేషం. ఆయన పురానా హవేలీలోనే నివాసముండేవాడు. ఆ క్రమంలో తన సంస్థానంలోని ఆర్థిక విభాగానికి ఈ భవనాలను కేటాయించారు. నిజాం ఆస్థానంలోని ప్రధాన మంత్రి కూడా తన సాధారణ పరిపాలనా శాఖను ఈ ప్యాలెస్ నుంచే నిర్వహించాడు. ఆంధ్రా, తెలంగాణ కలిశాక 1956 తర్వాత ఈ ప్రాంతం పేరు సైఫాబాద్ నుంచి సచివాలయంగా మారిపోయింది. ఇక్కడ అప్పటి నుంచీ అవసరాలను బట్టి ఒక్కో బ్లాక్ నిర్మిస్తూ వచ్చారు.

ఎ-బ్లాక్ భవన సముదాయాన్ని 1981లో నాటి సీఎం టి. అంజయ్య ప్రారంభించారు. సి-బ్లాక్‌ను 1978లో చెన్నారెడ్డి ప్రారంభించారు. ఇందులో మొత్తం 6 అంతస్తులున్నాయి. దీంట్లోనే ముఖ్యమంత్రులు కొలువుదీరేవారు. ముఖ్యమంత్రిగా ఎన్‌టీ రామారావు ఈ ప్యాలెస్‌లోని మొదటి అంతస్తులో తన కార్యాలయం నిర్వహించారు. కేసీఆర్ మినహా మిగతా సీఎంలు ఈ బ్లాక్ నుంచే పని చేశారు. ఎ-బ్లాక్ రెండో దశను 1998 ఆగస్టు 10న చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. డి-బ్లాక్‌కు 2003లో చంద్రబాబు శంకుస్థాపన చేయగా, 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి దాన్ని ప్రారంభించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అధీనంలో ఉన్న జె, ఎల్ బ్లాక్‌లను 1990లో మర్రి చెన్నారెడ్డి ప్రారంభిచారు. జే-బ్లాక్ సచివాలయంలో అతిపెద్దది. అయితే ఇదంతా ఇప్పుడు చరిత్ర మాత్రమే. శతాబ్దానికిపైగా రాచఠీవితో తన దర్పాన్ని ప్రదర్శించిన ఈ భవనం ఇకపై కనిపించదు.

Related News