ఒకవైపు టీఆర్ఎస్, మరోవైపు బీజేపీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని దెబ్బ తీస్తున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీసి నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ నేతలను చేర్చుకుంది టీఆర్ఎస్. ఇప్పుడు బీజేపీ ఆ పని ప్రారంభించి కాంగ్రెస్‌ను ఖాళీ చేసే పని పెట్టుకుంది. ఈ పరిస్థితుల్లో పూర్తిగా నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ క్యాడర్ త్వరలో గుడ్‌న్యూస్ వినే అవకాశం ఉంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో 13 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. అసెంబ్లీలో ఎంఐఎం పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండటంతో కాంగ్రెస్ మూడో స్థానంలోకి వెళ్లిపోయి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది.
ఇప్పుడు కాంగ్రెస్ మరోసారి అసెంబ్లీలో రెండో పెద్ద పార్టీగా మారే అవకాశాలు ఉన్నాయి. ఉప ఎన్నికలు జరగకుండానే ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఒకటి పెరగే అవకాశం ఉంది. వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ ఖాతాలో పడవచ్చు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌కు అనుకూలంగా వస్తే వేములవాడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ఎన్నిక కానున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ నుంచి చెన్నమనేని రమేష్ మూడుసార్లు విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన జర్మనీలో ప్రొఫెసర్‌గా పని చేసేవారు. చాలాకాలం జర్మనీలోనే నివసించిన చెన్నమనేని రమేష్‌కు జర్మనీ పౌరసత్వం ఉందనే ఆరోపణ ఉంది. ఈ విషయాన్ని దాచిపెట్టి అర్హత లేకపోయినా ఎమ్మెల్యేగా పోటీ చేశారని కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ కోర్టుకు వెళ్లారు.
సుమారు 11 ఏళ్లుగా చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై ఆది శ్రీనివాస్ కోర్టుల్లో పోరాడుతున్నారు. ఇప్పుడు ఈ కేసు చివరి దశకు వచ్చింది. చెన్నమనేని రమేష్‌కు జర్మనీ పౌరసత్వం ఉన్న మాట వాస్తవమేనని కేంద్రం గుర్తించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టులో ఉంది. త్వరలో తుది తీర్పు రానుంది. ఒకవేళ చెన్నమనేని రమేష్‌కు జర్మనీ పౌరసత్వం ఉందని కనుక కోర్టు నిర్ధారిస్తే రమేష్‌పై అనర్హత వేటు పడే అవకాశం ఉంది.
ఇదే జరిగితే గత ఎన్నికల్లో వేములవాడ అసెంబ్లీ నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మళ్లీ ఉప ఎన్నిక పెట్టకుండా రెండో స్థానంలో నిలిచిన వ్యక్తిని ఎమ్మెల్యేగా ఎన్నిక చేసే ఛాన్స్ ఉన్నట్లు న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఇందుకు ఒక ఉదాహరణ కూడా చెబుతున్నారు.
2014 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనంతపురం జిల్లా మడకశిర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈరన్న విజయం సాధించారు. అయితే, తనపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను దాచిపెట్టి ఈరన్న ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారని ఆయనపై ఓడిపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తిప్పేస్వామి కోర్టుకు వెళ్లారు.
నాలుగున్నరేళ్లు కోర్టులో పోరాడిన తర్వాత తిప్పేస్వామికి అనుకూలంగా తీర్పు వచ్చింది. క్రిమినల్ కేసులను దాచిపెట్టి పోటీ చేసినందున ఈరన్న అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేసిన కోర్టు రెండోస్థానంలో నిలిచి తిప్పేస్వామి ఎమ్మెల్యే అవుతారని తీర్పునిచ్చింది. దీంతో ఆరు నెలల పదవీకాలం ఉందనగా తిప్పేస్వామి ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు వేములవాడలోనూ చెన్నమనేని రమేష్‌కి వ్యతిరేకంగా తీర్పు వస్తే ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
ఇదే జరిగితే తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఏడుకు చేరుకుంటుంది. అసెంబ్లీలో రెండో పెద్ద పార్టీగా ఎంఐఎంతో పాటు కాంగ్రెస్ కూడా ఉంటుంది. ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి కొంత జోష్ రావచ్చు. అసెంబ్లీలో అధికార టీఆర్ఎస్కు మిత్రపక్షంగా ఉన్న ఎంఐఎం ప్రధాన ప్రతిపక్షంగా ఇప్పుడు ఉంది. ఇది కూడా మారి కాంగ్రెస్ కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉంటుంది.