టీడీపీలో మరోసారి అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. బెజవాడలో ఎంపీ కేశినేని నానికి చేదు అనుభవం ఎదురైంది. వన్ టౌన్ నాలుగు స్థంబాల డివిజన్లో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చిన నానిని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వర్గీయులు అడ్డుకున్నారు. పార్టీ మారిన వారిని టీడీపీలో ఎలా ప్రోత్సహిస్తారని వెంకన్న వర్గీయులు ప్రశ్నించారు.
కేశినేని నానితో వాగ్వాదానికి దిగారు. కనీసం పార్టీ కండువా కూడా కప్పుకోని వ్యక్తిని పార్టీ తరపున ఎలా ప్రచారం చేయిస్తారని ప్రశ్నించారు. ఒకే చోట ఇద్దరు కార్పొరేట్ అభ్యర్థులను ఎలా పెడతారని ప్రశ్నించారు. కాగా బుద్ధా వెంకన్న వర్గీయులను కేశినేని నాని వారించే ప్రయత్నం చేసారు.
తాను తప్పు చేస్తే పార్టీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందన్నారు. గతంలో చంద్రబాబు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకొచ్చారని గుర్తుచేశారు. వాళ్లలో కొంతమంది గతంలో విమర్శించినవారేనన్నారు. ఎవరు తప్పు చేసినా నేరుగా చంద్రబాబును కలిసి ఫిర్యాదు చేయవచ్చని అంతేకాని ఇలా నడి రోడ్డుపై అడ్డగిస్తే వారికే నష్టమంటూ మంత్రి కేశినేని వ్యాఖ్యలు చేసారు.