ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని, అమరావతిని కాదు కదా.. అమరావతిలో గడ్డి కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పీకలేడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు 300వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పెనుమాక గ్రామంలో దీక్ష చేస్తున్న రైతులకు నారా లోకేశ్ సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అమరావతిని చంపేసేందుకు వైసీపీ ప్రభుత్వం రకరకాల కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. రాజధానిని కాపాడుకునేందుకు ఉద్యమిస్తున్న రైతులు, మహిళలను వైసీపీ నేతలు, మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతూ కించపరుస్తున్నారని, అయినా కూడా రైతులు ఓపికగా, శాంతియుతంగా పోరాడుతున్నారని పేర్కొన్నారు.
అమరావతి కోసం ఇప్పటివరకు 90 మంది రైతులు మరణించినా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని అన్నారు. రైతుల పక్షాన తాము అన్ని రకాలుగా పోరాటం చేస్తామని, అమరావతిని కచ్చితంగా రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ఉండేలా చేస్తామని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.