logo

ఆస‌క్తిక‌ర స‌వాళ్లు… సీఎల్పీ నేత‌ భ‌ట్టి ఇంటికి మంత్రి త‌ల‌సాని

తెలంగాణ అసెంబ్లీలో స‌వాళ్ల ప‌ర్వం మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారుతోంది. నిన్న తెలంగాణ అసెంబ్లీలో సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో డ‌బుల్ బెడ్రూం ఇళ్ల కోసం పేద‌ల నుంచి ల‌క్ష‌ల్లో అప్లికేష‌న్లు వ‌స్తున్నాయ‌ని, లో ఇళ్లు క‌డ‌తామ‌ని చెప్పిన ప్ర‌భుత్వం మాట త‌ప్పింద‌ని ఆరోపించారు. మ‌ళ్లీ ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు వ‌స్తున్నందున డ‌బుల్ బెడ్రూం ఇళ్ల ప్ర‌చారం మొద‌లుపెట్టార‌ని భట్టి వ్యాఖ్యానించారు.

భ‌ట్టి వ్యాఖ్య‌ల‌కు మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. హైద‌రాబాద్‌లో ల‌క్ష డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం జ‌రుగుతోంద‌ని, అవ‌స‌ర‌మైతే భ‌ట్టి విక్ర‌మార్క‌ను తీసుకెళ్లి ఈ ఇళ్ల‌ను చూపిస్తాన‌ని స‌వాల్ చేశారు. ఈ స‌వాల్‌ను భ‌ట్టి విక్ర‌మార్క స్వీక‌రించారు. తాను వ‌స్తాన‌ని, ల‌క్ష డ‌బుల్ బెడ్రూం ఇళ్ల‌ను చూపించాల‌ని డిమాండ్ చేశారు. ఇద్ద‌రు నేత‌లు స‌వాళ్ల‌ను స్వీక‌రించ‌డంతో ఇవాళ ఇది మ‌రింత దూరం వెళ్లింది.

భ‌ట్టి విక్ర‌మార్క ఇంటికి మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్‌, న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ వెళ్లారు. వీరికి భ‌ట్టి స్వాగ‌తం ప‌లికి ఇంట్లోకి ఆహ్వానించారు. ఆ త‌ర్వాత న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల్లో జ‌రుగుతున్న డ‌బుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాల‌ను ప‌రిశీలించేందుకు ఇద్ద‌రు నేతలు బ‌య‌లుదేరి వెళ్లారు. కాగా, నిన్న అసెంబ్లీలో స‌వాళ్లు విసురుకున్న నేత‌లు ఇవాళ స్నేహ‌పూర్వ‌కంగా మాట్లాడుకున్నారు. సామ‌ర‌స్య‌పూర్వ‌క వాతావ‌ర‌ణంలో స‌వాళ్ల‌ను స్వీక‌రించి, డ‌బుల్ బెడ్రూం ఇళ్ల ప‌రిశీల‌న‌కు వెళ్లారు.

Related News