కరోనా బారిన పడిన వారు ప్రధానంగా ఆక్సీజన్ లెవల్స్‌ను పరీక్షించుకోవాల్సి ఉంటుంది. కరోనా బాధితులకు ఎక్కువగా ఆక్సిజన్ లెవల్స్ పడిపోతున్నాయి. అందుకే కరోనా బాధితులు పల్స్ ఆక్సీమీటర్ల ద్వారా ఎప్పటికప్పుడు సాచురేషన్ లెవల్స్ చూసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. పల్స్ ఆక్సీమీటర్లో సాచురేషన్ లెవల్స్ 93 శాతం కంటే తక్కువ ఉంటే వెంటనే చికిత్స అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఒకవేళ 90 శాతం కంటే తక్కువకు పడిపోతే వెంటనే ఎమర్జెన్సీగా భావించి చికిత్స అందించాల్సి ఉంటుంది.
రెస్పిరేటరీ రేట్ ద్వారా పల్స్ ఆక్సీమీటర్ వంటి పరికరాలు ఏమీ లేకుండానే మన ఆక్సీజన్ లెవల్స్ తెలుసుకోవచ్చని బెంగళూరులోని నేషనల్ ట్యుబర్కులోసిస్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డా.సోమశేఖర తెలిపారు. మన అరచేతిని ఛాతిపై పెట్టుకొని ఒక నిమిషంలో ఎన్నిసార్లు ఊపిరి తీసుకుంటున్నామని చూసుకోవాలి. ఒకవేళ మనం కనుక నిమిషానికి 24 కంటే తక్కువ సార్లు ఊపిరి తీసుకుంటున్నట్లయితే మన ఆక్సీజన్ లెవల్స్ బాగానే ఉన్నట్లు భావించాలని ఆయన అంటున్నారు. ఒకవేళ నిమిషానికి 30 సార్ల కంటే ఎక్కువ ఊపిరి తీసుకుంటున్నట్లయితే ఆ వ్యక్తిలో ఆక్సీజన్ లెవల్ తక్కువగా ఉందని భావించాలని ఆయన తెలిపారు.
శరీరంలో ఆక్సీజన్ లెవల్స్ తక్కువగా ఉన్నాయని చెప్పేందుకు పలు లక్షణాలు కూడా కనిపిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణాలను హెచ్చరికగా భావించాలని సూచిస్తున్నారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, గందరగోళంగా ఉండటం, నడవడానికి చాలా ఆయాసపడటం, పెదవులు, మొహం నీలి రంగుగా కనిపించడం వంటి లక్షణాలు ఆక్సీజన్ లెవల్స్ తక్కువగా ఉన్న వారిలో కనిపించవచ్చు. ఒక్కోసారి ఛాతినొప్పి కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.
ఆక్సీజన్ లెవల్స్ పెంచుకోవడానికి ప్రోనింగ్ ఎక్సర్సైజ్ తాత్కాలికంగా బాగానే పని చేస్తోందని కేంద్ర వైద్యారోగ్య శాఖ కూడా తెలియజేసింది. హోం ఐసోలేషన్‌లో ఉంటూ కరోనా చికిత్స పొందుతున్న వారిలో సాచురేషన్ లెవల్స్ 94 శాతం కంటే తక్కువగా ఉన్నట్లయితే ప్రొనింగ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. 30 నిమిషాల నుంచి 2 గంటల పాటు ప్రోనింగ్ చేయవచ్చు అని సూచిస్తున్నారు.