ప్రేమించిన యువతి తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు యత్నించాడు. పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలో పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాడు. యువకుడిని వెంటనే పోలీసులు ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా పిల్లలమర్రికి చెందిన రామన్ అనే యువకుడు నగరంలోని ఓ సంస్థలో గ్రాఫిక్ వెబ్ డిజైనర్ గా పనిచేస్తున్నాడు. పదేళ్లుగా తన గ్రామానికి చెందిన అనూష అనే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఇటీవల అనూషకు కస్తూర్భా గాంధీ బాలికల ఆశ్రమంలో ఉద్యోగం వచ్చింది. అప్పటి నుంచి ప్రియురాలు తనను పటించుకోవడం మానేసిందని రామన్ మనస్థాపానికి గురయ్యాడు.
ఈ క్రమంలో అనూషతో తనకున్న ప్రేమను పుస్తకంగా రాసి తన స్నేహితులకు పంచాడు. ఈ విషయం అనూషకు తెలిసి తామిద్దరం మాట్లాడుకున్న కాల్ రికార్డింగ్స్ ను , పుస్తకాలను ప్రింట్ చేసి అందరికి పంచుతూ తన పరువుకు భంగం కలిగిస్తున్నాడని అనూష చివ్వేంల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలిసిన రామన్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. అపస్మారక స్థితిలో ఉన్న రామన్ ను పోలీసులు పట్టణ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.