ఒకసారి కరోనా బారిన పడి వైరస్ను జయించిన వారికి 10 నెలల పాటు శరీరంలో రోగ నిరోధక శక్తి రక్షణ కల్పిస్తుందని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు చేసిన ఒక స్టడీలో తేలింది. లాన్సెట్ అనే సైన్స్ జర్నల్లో ఈ స్టడీకి సంబంధించిన వివరాలు ప్రచురించారు. ఇంగ్లాంగ్లోని కేర్ హోంలో నివసాముంటున్న 2,111 మంది సాధారణ ప్రజలు, వైద్య సిబ్బందిపై ఈ అధ్యయనం జరిగింది.
ఒకసారి కరోనా వచ్చిన వారికి 10 నెలల పాటు కరోనా నుంచి రక్షణ ఉంటోందని ఈ స్టడీలో తేలింది. ఒకసారి కరోనా వచ్చి కోలుకున్న సాధారణ ప్రజల్లో మళ్లీ కరోనా వైరస్ ఇన్ఫెక్ట్ అయ్యే ప్రమాదం 85 శాతం తక్కువగా ఉంటోంది. వైద్య సిబ్బంది రీఇన్ఫెక్ట్ అయ్యే ముప్పు 60 శాతం తక్కువగా ఉంటోంది. ఒకసారి కరోనా బారిన పడ్డవారు 10 నెలల వరకు మళ్లీ ఈ వైరస్ బారిన పడే అవకాశాలు అతి తక్కువేనని ఈ స్టడీ వెల్లడించింది.
ఒకసారి కరోనా బారిన పడిన వారు మళ్లీ ఎప్పుడూ కరోనా రీఇన్ఫెక్షన్కు గురవుతారని తెలుసుకునే లక్ష్యంతో ఈ అధ్యయనం జరిగింది. ఈ స్టడీలో పాల్గొన్న 2,111 మందిలో 682 మంది సాధారణ ప్రజలు, 1,429 మంది వైద్య సిబ్బంది ఉన్నారు. గత ఏడాది అక్టోబరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు వీరిని పరిశోధకులు పరిశీలించి పలుమార్లు కరోనా యాంటీబాడీ టెస్టులు చేశారు.
మొత్తం 2,111 మందిలో 634 మంది ఇంతకుముందే కరోనా బారిన పడ్డారు. వీరిలో కేవలం 14 మంది మాత్రమే రీఇన్ఫెక్షన్కు గురయ్యారు. ఇంతకుముందు కరోనా రాని 1,477 మందిలో 204 మంది మొదటిసారి కరోనా బారిన పడ్డారు. మొత్తానికి ఈ స్టడీలో తేలింది ఏమిటీ అంటే… ఒకసారి కరోనా బారిన పడ్డ వారికి శరీరంలోని రోగనిరోధక శక్తి 10 నెలల పాటు మళ్లీ కరోనా ఇన్ఫెక్ట్ కాకుండా రక్షణ కలిగిస్తోంది.