logo

గ‌డ్డం పెంచ‌డం కాదు.. నో షేవ్ న‌వంబ‌ర్ అస‌లు క‌థ తెలుసా..?

గ‌డ్డం పెంచుకోవ‌డం ఇటీవ‌ల యూత్‌లో ట్రెండ్‌గా మారింది. సినిమాల్లో హీరోలు ఈ ట్రెండ్‌ను ప్రారంభిస్తే యూత్ బాగా ఫాలో అవుతోంది. ఇంత‌కుముందు నీట్ షేవ్ చేసుకోవ‌డ‌మే అందం అనుకునే వారు ఇప్పుడు నిండు గ‌డ్డంతో క‌నిపించ‌డ‌మే స్టైల్ అని భావిస్తున్నారు. గ‌డ్డంలోనూ ర‌క‌ర‌కాల స్టైల్స్ మెయిన్‌టైన్ చేస్తున్నారు.

గ‌డ్డంలో పిచ్చోడిలా ఉన్నావు… షేవ్ చేయించుకో అని త‌ల్లిదండ్రులు చేబుతున్నా ప‌ట్టించుకోరు. ఇటీవ‌లి కాలంలో కాలేజీలు, ఐటీ ఆఫీసుల్లోనూ గ‌డ్డం పెంచుకునేందుకు పెద్ద అడ్డు చెప్ప‌డం లేదు. దీంతో యువ‌కులంతా గ‌డ్డంతోనే కాలేజీల‌కు, ఆఫీసుల‌కు వెళుతున్నారు.

ఇక‌, ఎప్పుడూ గ‌డ్డం పెంచుకోని వారు కూడా న‌వంబ‌ర్‌లో గ‌డ్డం పెంచుకోవ‌డం మ‌రో ట్రెండ్‌గా మారింది. ఇందుకు నో షేవ్ న‌వంబ‌ర్ అనే పేరు కూడా ఉంది. న‌వంబ‌ర్ మొత్తం గ‌డ్డం పెంచుకోవ‌డం ఇటీవ‌ల కాలంలో పెరిగిపోయింది. అయితే, అస‌లు నో షేవ్ న‌వంబ‌ర్ అంటే ఏంటో చాలా మంది యువ‌కుల‌కు కూడా తెలియ‌దు.

నో షేవ్ న‌వంబ‌ర్ కాన్సెప్ట్ అమెరికా నుంచి మొద‌లైంది. క్యాన్స‌ర్ వ్యాధి ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఈ నోషేవ్ న‌వంబ‌ర్ అనే కాన్సెప్ట్‌ను ప్రారంభించారు. క్యాన్స‌ర్ బాధితులు వారి వెంట్రుక‌ల‌ను పూర్తిగా కోల్పోతారు. కాబ‌ట్టి, క్యాన్స‌ర్ వ్యాధి బారిన ప‌డ‌కుండా అవ‌గాహ‌న క‌ల్పించేందుకు న‌వంబ‌ర్ నెల మొత్తం షేవింగ్‌, గ్రూమింగ్ చేసుకోవ‌ద్ద‌నేది ఈ నో షేవ్ న‌వంబ‌ర్ ఉద్దేశ్యం.

అంతేకాదు, ఈ నో షేవ్ న‌వంబ‌ర్ వెనుక మ‌రో మంచి ఉద్దేశ్యం కూడా ఉంది. నో షేవ్ న‌వంబ‌ర్ పాటించే వారంతా ఆ నెల మొత్తం షేవింగ్‌, గ్రూమింగ్ చేసుకోరు. కాబ‌ట్టి ఇలా మిగిలే డబ్బును క్యాన్స‌ర్ వ్యాధిగ్ర‌స్తుల‌కు విరాళం ఇవ్వాల‌నేది అస‌లు ఉద్దేశ్యం. అమెరికాతో పాటు ప‌లు విదేశాల్లో ఇలానే యువ‌కులు గ‌డ్డం పెంచుకొని మిగిలే డ‌బ్బును విరాళంగా ఇస్తుంటారు.

మ‌న దేశంలో మాత్రం నో షేవ్ నవంబ‌ర్‌లో పాల్గొంటూ గ‌డ్డాలు పెంచుకొని తిరుగుతున్నా ఎక్కువ మందికి ఈ కాన్సెప్ట్ వెనుక అసలైన ఉద్దేశ్యాలు తెలియ‌వు. దీంతో ఎక్కువ మంది మిగిలిన డ‌బ్బును ఎటువంటి విరాళాలు ఇవ్వ‌డం లేదు. మన యువ‌కులు కూడా ఇలా మిగిలే డ‌బ్బును విరాళాలుగా ఇస్తే క్యాన్స‌ర్ వ్యాధిగ్ర‌స్తుల‌కు ఎంతో మేలు జ‌రుగుతుంది.

Related News