32 ఏళ్ల ఒక భారతీయుడిని చైనా ప్రజల్లో గుండెల్లో పెట్టుకున్నారు. విగ్రహం పెట్టుకొని ఆరాధిస్తున్నారు. మ్యూజియం పెట్టి గౌరవించుకుంటున్నారు. సినిమా తీసి గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకు ఒక భారతీయ యువకుడిని చైనా ప్రజలు ఇంతలా ప్రేమిస్తున్నారనేది చాలా ఆసక్తికర కథ. భారతీయుల మానవత్వాన్ని చాటి చెప్పే అపురూప కథ. ఈ కథేంటో మీరూ చూడండి.
ఇది మన భారత దేశానికి స్వాతంత్య్రం రాకముందు 1938లో ప్రారంభమైన కథ. అప్పుడు భారతీయులు స్వాతంత్య్ర పోరాటంలో నిమగ్నమై ఉన్నారు. ఇదే సమయంలో చైనాలో జపాన్ ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతోంది. జపాన్ మీద చైనా పోరాడుతోంది. ఈ సమయంలో తమకు సాయం చేయాల్సిందిగా మిత్రదేశాలను చైనా నేత మావో కోరారు. తమ దేశానికి వైద్యులను పంపించాలని భారత్‌ను కోరారు. కల్లోలంగా మారిన చైనాకు తమ వంతు సాయం చేయాలని ఆనాటి భారత నాయకులు జవహర్ లాల్ నెహ్రూ, నేతాజి సుభాష్ చంద్రబోస్ నిర్ణయించారు.
అఖిల భారత చైనా నిధి పేరుతో 22 వేల విరాళాలు సేకరించారు. చైనాకు పంపించడానికి ఒక వైద్య బృందాన్ని సిద్ధం చేశారు. ఒక ఆంబులెన్స్, సేకరించిన విరాళాలు, ఐదుగురు వైద్యులతో కూడా బృందాన్ని చైనాకు పంపించారు. ఈ బృందంలో మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన డాక్టర్ ద్వారకానాథ్ శాంతారామ్ కోట్నీస్ అనే 28 ఏళ్ల యువ వైద్యుడు కూడా ఒకరు. 1938 సెప్టెంబర్‌లో ఈ వైద్య బృందం చైనాలోకి అడుగుపెట్టింది.
అప్పటికే యుద్ధరంగంలో కల్లోలంగా ఉన్న యెనాన్ అనే పర్వతప్రాంతంలో భారతీయ వైద్యులు సేవ చేసేందుకు సిద్ధపడ్డారు. వీరంతా వైద్యసేవలు అందించేందుకు ఎంతో కష్టపడ్డారు. ప్రత్యేకించి ద్వారకానాథ్ కోట్నీస్ నిద్రాహారాలు కూడా పట్టించుకోకుండా మొబైల్ హాస్పిటల్ ద్వారా సైనికులకు నిరంతరం వైద్య సేవలు అందించి ఎంతో మందిని కాపాడారు. ఈ క్రమంలో కోట్నీస్ చేస్తున్న సేవకు చైనా ప్రజలు చలించిపోయారు. ఎక్కడ ఎక్కువ అవసరం ఉంటే అక్కడకు వెళ్లి వైద్య సేవలు అందించేందుకు కోట్నీస్ ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు.
ఒక్కోసారి మూడు రోజుల పాటు ఒక్క క్షణం కూడా నిద్ర లేకుండా పని చేసేవారు. నాలుగేళ్ల పాటు కోట్నీస్ అవిశ్రాంతంగా చైనా సైనికులకు సేవ చేశారు. ఈ క్రమంలో చైనా పట్ల, చైనా ప్రజల పట్ల కోట్నీస్కు కూడా ఇష్టం పెరిగింది. చైనా భాష మాట్లాడటం, రాయడం కూడా నేర్చుకున్నారు. తన వద్ద పని చేసే ఓ నర్సును కోట్నీస్ ప్రేమించారు. 1941లో వీరు వివాహం చేసుకొని చైనాలోనే స్థిరపడాలని నిర్ణయించుకున్నారు.
వారికి ఒక కుమారుడు కూడా జన్మించాడు. అతడి పేరు జిన్హుఆ(YINHUA) అని పెట్టుకున్నారు. అంటే ఇండియా, చైనా అని ఆ పేరుకు అర్థం. ఇలా రెండు దేశాల పట్ల కోట్నీస్కు ప్రేమ ఉండేది. అయితే, యుద్ధక్షేత్రంలో నిద్ర, ఆహారం కూడా లేకుండా 24 గంటలూ పని చేసిన కోట్నీస్ తన ఆరోగ్యం గురించి మాత్రం పట్టించుకోలేదు. దీంతో పెళ్లైన రెండేళ్లకే ద్వారకానాథ్ కోట్నీస్ ఆరోగ్యం పూర్తిగా పాడయ్యింది. మూర్చ వ్యాధితో ఆయన బాధపడ్డారు. 1942 డిసెంబర్ 9న ఆయన అక్కడే చివరి శ్వాస విడిచారు.
తమ దేశం కోసం, తమ సైనికుల కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సేవ చేసిన ద్వారకానాథ్ కోట్నీస్‌ను చైనా నాయకులు గౌరవించారు. ఆయన సమాధి వద్ద స్మారకాన్ని ఏర్పాటు చేశారు. గౌరవసూచికంగా విగ్రహాన్ని పెట్టుకున్నారు. మ్యూజియం ఏర్పాటుచేసి కోట్నీస్ ఫోటోలు, వాడిన వైద్య పరికరాలు, అందులో పెట్టారు. పూర్వీకులను స్మరించుకునేందుకు చైనా ప్రజలు ప్రటీ సంవత్సరం ఒక పండుగను జరుపుకుంటారు. ఆ పండుగ రోజు వారు కోట్నోస్ సమాధి వద్దకు వెళ్లి ఆయనకు నివాళులర్పిస్తారు.
మావో సహా చైనా నాయకులు కోట్నీస్ సేవలను విశేషంగా కొనియాడేవారు. షోలాపూర్‌లో పుట్టి చైనాలో కన్నుమూసిన కోట్నీస్కు షోలాపూర్‌లో కూడా చాలా గౌరవం లభించింది. అక్కడ కూడా ఆయన విగ్రహం పెట్టుకున్నారు. కోట్నీస్ కుటుంబసభ్యులు ఇప్పటికీ షోలాపూర్‌లోనే ఉంటారు. గతంలో చైనా నాయకులు భారత్‌కు వచ్చినప్పుడు షోలాపూర్ వచ్చి ఆయన కుటుంబసభ్యులను కలిసేవారు. 1910లో పుట్టి 1942లో 32 ఏళ్ల వయస్సులోనే మరణించిన ద్వారాకానాథ్ కోట్నీస్ కుమారుడు కూడా వైద్యుడే. 24 ఏళ్ల వయస్సులోనే ఆయన కూడా మరణించాడు. కోట్నీస్ గొప్పదనాన్ని చెబుతూ భారత్‌లో, చైనాలో సినిమాలు కూడా వచ్చాయి.