ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలను ఏర్పాటుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుపతి కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటైంది. ఇప్పటివరకు చిత్తూరు జిల్లాలో తిరుపతి భాగంగా ఉండేది. నిజానికి, చిత్తూరు జిల్లాలో తిరుపతి పెద్ద నగరం. కానీ, గతంలో అప్పటి పరిస్థితుల ఆధారంగా చిత్తూరు నగరమే జిల్లా కేంద్రంగా ఉండేది. చిత్తూరు జిల్లాలో తిరుపతి ఉండేది.
ఇప్పుడు మాత్రం తిరుపతి నగరమే కేంద్రంగా జిల్లా ఏర్పాటైంది. ఈ జిల్లా ప్రత్యేకతను గుర్తించేలా ప్రభుత్వం శ్రీ బాలాజీ జిల్లా అని వేంకటేశ్వరస్వామి పేరు పెట్టింది. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గం పరిధినే కొత్త జిల్లాగా చేశారు. శ్రీ బాలాజి జిల్లాలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట, గూడురు, వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గాలతో శ్రీ బాలాజి జిల్లా ఏర్పాటైంది.
ఇందులో సూళ్లూరుపేట, గూడురు, వెంకటగిరి నియోజకవర్గాలు ఇంతకాలం నెల్లూరు జిల్లాలో ఉండేవి. ఇప్పుడు ఇవి శ్రీబాలాజి జిల్లాలోకి వచ్చాయి. తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలు ఇంత కాలం చిత్తూరు జిల్లాలో ఉండగా ఇప్పుడు శ్రీ బాలాజీ జిల్లాలోకి వచ్చాయి. నిజానికి పార్లమెంటు నియోజకవర్గం ఆధారంగా ప్రభుత్వం జిల్లాలను చేసింది.
అయితే, పాలనాపరంగా, భౌగోళికంగా సమస్యలు రాకుండా కొన్ని మార్పులు చేసింది. ఈ క్రమంలో చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఉన్న చంద్రగిరిని శ్రీబాలాజీ జిల్లాలో చేర్చింది. చంద్రగిరి తిరుపతి పక్కనే ఉంటుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీ బాలాజీ జిల్లాలో గూడురు, తిరుపతి, నాయుడుపేట రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. మొత్తం 35 మండలాలు ఉన్నాయి. శ్రీ బాలాజీ జిల్లా మొత్తం విస్తీర్ణం 9,176 చదరపు కిలోమీటర్లు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ జిల్లా మొత్తం జనాభా 22.18 లక్షలుగా ఉంది.