గానగంధర్వుడు, పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జీవితంలో ఎన్నో ఆసక్తికర సంఘటనలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆయన గొప్పదనాన్ని తెలియజేస్తాయి. ఎస్పీ బాలు స్వస్థలం నెల్లూరులోని తిప్పరాజువారి వీధి. ఆయన తండ్రి హరికథా కళాకారుడు. ఇంజనీర్ చదివిన బాలసుబ్రహ్మణ్యం సంగీతంపై తన ఆసక్తితో సినిమా రంగంలోకి వచ్చారు. శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న సినిమాలో గాయకుడాగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన బాలు తర్వాత ఒక్కో మెట్టూ ఎదుగుతూ వెళ్లారు.
తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మళయాళం వంటి సుమారు 10 భాషల్లో 40 వేల పాటలు ఆయన పాడారంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన వృత్తిలో ఎంత విజయవంతం అయ్యారో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఎంత ఎత్తుకు ఎదిగినా ఆయనలో సేవాభావం, సమాజం పట్ల తపన ఉండేది. ఇందుకు ఉదాహరణ ఆయన తన సొంతింటిని దానం చేయడం. నెల్లూరు తిప్పరాజువారి వీధిలో పూర్వీకుల నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఒక ఇల్లు ఆస్తిగా వచ్చింది.
ఈ గృహాన్ని ఆయన కంచి పీఠానికి విరాళంగా ఇచ్చారు. వేద పాఠశాలను నిర్వహించడానికి గానూ ఆయన తన సొంతింటిని పీఠానికి రాసిచ్చారు. కంచి పీఠాధిపతి జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామిని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్వయంగా కలిగి తన ఇంటిని పీఠానికి సమర్పించి, ఆ ఇంటిలో శైవభక్తులైన తన తండ్రికి గుర్తుగా వేద పాఠశాల నిర్వహించాలని కోరారు. ఈ సమయంలో బాలు మాట్లాడుతూ తాను కంచి పీఠానికి తన గృహాన్ని అప్పగించలేదని, భగవంతుడికి ఇది సేవగా భావిస్తున్నట్లు చెప్పారు.
బాలసుబ్రహ్మణ్య మరణానికి ఎప్పుడూ బయపడలేదు. ఏదో ఓ రోజు ఈ లోకాన్ని విడిచిపోక తప్పదని ఆయన నమ్మేవారు. అందుకే తన మరణం గురించి, తన చివరి కోరిక గురించి కూడా ఆయన మాట్లాడేవారు. ఒకసారి ఆయన తను మరణిస్తే తన సమాధిపైన ఏమి రాయాలో కూడా చెప్పారు. 1999లో ఓ పాటల పోటీకి ముఖ్యఅతిథిగా మంగళంపల్లి బాలమురళీకృష్ణ వచ్చారు. ఆయన అంటే ఎస్పీ బాలుకు విపరీతమైన గురుభక్తి.
ఈ కార్యక్రమానికి ఆయన రావడంతో ఎస్పీ చాలా సంతోషపడ్డారు. ఈ కార్యక్రమంలో మంగళంపల్లి బాలమురళీకృష్ణ మాట్లాడుతూ.. బాలు కష్టపడితే తన లాగా పాడగలడని, కానీ తాను ఎంత కష్టపడినా బాలు లాగా పాడలేనని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గురించి చాలా గొప్పగా మాట్లాడాడు. బాలమురళీకృష్ణ మాటలు తన జీవితంలో అతి పెద్ద ప్రశంసలని బాలు చెప్పుకునేవారు. అందుకే తన మరణం తర్వాత తన సమాధిపైన ఏమైనా రాయాలి అనుకుంటే మంగళంపల్లి బాలమరళీకృష్ణ లాంటి మహానుభావులు బాలసుబ్రహ్మణ్యం గురించి ఇలా అన్నారు అని రాయాలని కోరారు.