సుప్రసిద్ధ గాయకుడు, సంగీత దర్శకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(74) తుది శ్వాస విడిచారు. కరోనాతో చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో ఆగస్టు 4 నుంచి చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు. బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4న జన్మించారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఆయన 40 వేలకు పైగా పాటలు పాడి రికార్డు సృష్టించారు. అభిమానులు ఆయనను బాలు అని పిలుచుకుంటారు. అన్ని భాషల్లో అభిమానులు ఆయనకు ఉన్నారు. బాలు స్వస్థలం నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామం. ఆయన తండ్రి హరికథా కళాకారుడు కావడంతో చిన్నప్పటి నుంచే బాలసుబ్రహ్మణ్యం సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారు.
అయితే, బాలును ఉన్నత చదువులు చదివించాలని ఆయన తండ్రి కలలుగనేవారు. తండ్రి కోరిక మేరకు మద్రాస్‌లో ఇంజనీరింగ్ చదువారు బాలు. 1966లో పద్మనాభం నిర్మించిన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రం ద్వారా ఆయన సినీ గాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఆయనకు వరుసగా తెలుగు, తమిళంలో అవకాశాలు వచ్చాయి.
నటుడిగా కూడా పలు తెలుగు, తమిళ సినిమాల్లో కనిపించారు బాలు. కమల్ హాసన్, రజినీకాంత్, సల్మాన్ ఖాన్ వంటి అగ్రనటులకు ఆయన డబ్బింగ్ కూడా చెప్పారు. 2001లో కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ పురస్కారం ఇవ్వగా, 2011లో పద్మభూషణ్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాల నుంచి కూడా ఆయన అనేక అవార్డులు, పలు చిత్రాలకు జాతీయ అవార్డులు కూడా అందుకున్నారు.