లాక్ డౌన్ సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వలస కార్మికులకు ఆపద్బాంధవుడిలా మారాడు నటుడు సోనూసూద్. ఇప్పటికీ ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నాడు. అయితే సోనూ సూద్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు సంబందించిన షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
సోనూ సేవ కార్యక్రమాల కోసం తన ఆస్తులు తాకట్టు పెట్టాడట. ముంబై జుహు ప్రాంతంలో ఉన్న తన ఎనిమిది అంతస్థుల భవనాన్ని రూ. 10 కోట్ల విరాళాలను సేకరించడం కోసం తాకట్టు పెట్టాడట. ఇందులో రెండు దుకాణాలు, ఆరు ప్లాట్లు ఉన్నాయట. ఇందుకు సంబందించిన రిజిస్ట్రేషన్ నవంబర్ నెలలో పూర్తయినట్టు తెలుస్తుంది.
లాక్ డౌన్ సమయంలో వేలాది మంది వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చడానికి సోనూ బస్సులు, ఫ్లయిట్లను ఉపయోగించాడు. ఇప్పటికీ నిరుపేదలకు అవసరమైన వైద్యం, విద్య సదుపాయాలు అందిస్తున్నాడు. నిరుద్యోగుల కోసం కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. తాజా వార్తలపై వెస్ట్ ఇండియా రెసిడెన్షియల్ సర్వీసెస్ సీనియర్ డైరెక్టర్ అండ్ హెడ్ రితేష్ మెహతా స్పందిస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఇతరుల కోసం ఇంతలా పనిచేసే వ్యక్తిని నేను ఇప్పటివరకు చూడలేదని అయన మీడియాతో వ్యాఖ్యానించారు.