తెలంగాణ ప్రజలకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో మరో ఆరు కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేసింది. ఈ మేరకు ఏఏఐ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించింది. తెలంగాణ ప్రస్తుతం ఒక్క హైదరాబాద్‌లో మాత్రమే విమానాశ్రయం ఉంది. కాబట్టి మరిన్ని విమానాశ్రయాలను ఏర్పాటుచేయడం ద్వారా అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావడంతో పాటు విమానయాన ప్రయాణ సౌకర్యం పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం సైతం ఉడాన్ పథకం కింద ద్వితీయ శ్రేణి నగరాలకు విమాన ప్రయాణ సౌకర్యం కల్పించాలని భావిస్తోంది. దీంతో రాష్ట్రంలో ఎక్కడెక్కడ కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంద విషయమై రాష్ట్ర ప్రభుత్వం అనేక అంశాలు పరిశీలించి ఆరు ప్రాంతాలను గుర్తించింది. ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలోని మామునూరు, పెద్దపల్లి జిల్లాలోని బసంత్ నగర్, నిజామాబాద్‌లోని జక్రాన్‌పల్లి, కొత్తగూడెం, మహబూబ్‌నగర్ జిల్లాలోని గుడిబండలో మొత్తం ఆరు ప్రాంతీయ విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది.
ఈ విషయమై మరింత అధ్యయనం చేయాలని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. దీంతో ఏఏఐ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ప్రాంతాల్లో పలుమార్లు పర్యటించి వివిధ అంశాలను పరిశీలించింది. ఆరు ప్రాంతాల్లోనూ ప్రాంతీయ విమానాశ్రయాల ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అయితే, ఎయిర్‌పోర్ట్‌ల ఏర్పాటుకు సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులను సైతం ఏఏఐ ప్రస్తావించింది.
రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ఆరు ప్రాంతాల్లోని పెద్దపల్లి, కొత్తగూడెం, మహబూబ్‌నగర్‌లలో ఎయిర్‌పోర్ట్‌ల కోసం ప్రతిపాదించిన ప్రాంతాలకు ఒక వైపున ఎత్తైన కొండలు ఉన్నాయని ఏఏఐ చెప్పింది. కాబట్టి, ఈ ప్రాంతాల్లో ఎయిర్‌పోర్ట్‌లు నిర్మిస్తే విమానాలు కొండలు ఉన్న వైపున రాకపోకలు సాగించడం కష్టమవుతుందని, కానీ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఇదేమీ పెద్ద ఆటంకం కాదని సైతం ఏఏఐ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది.
తెలంగాణలో ఇప్పుడు హైదరాబాద్‌లో మాత్రమే ఎయిర్‌పోర్టు ఉంది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి నగరాలు కూడా బాగా అభివృద్ధి చెందుతున్నా ఎయిర్‌పోర్టులు మాత్రం లేవు. అందుకే కొత్తగా మరో ఆరు ఎయిర్‌పోర్టులు కట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎయిర్‌పోర్టులు నిర్మించిన ప్రాంతాల్లో అభివృద్ధి మరింత వేగంగా జరుగుతోంది. పెట్టుబడులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.