logo

  BREAKING NEWS

షాకింగ్‌.. భార్య‌ల‌ను అద్దెకు ఇస్తున్నారు  |   కౌశీక్ రెడ్డికి బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఏకంగా డ‌బుల్ ప్ర‌మోష‌న్‌..!  |   తెలంగాణ బీజేపీకి జోష్‌.. త్వ‌ర‌లోనే మాజీ ఎంపీ, కాంగ్రెస్ కీల‌క నేత చేరిక‌  |   రెండు డోసుల క‌రోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి శుభ‌వార్త‌  |   సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌పై పోలీసుల విచార‌ణ‌లో వెలుగులోకి కొత్త విష‌యాలు  |   తేజ్ బైక్ ధ‌ర ఎంత ? ఎంత స్పీడ్‌తో వెళుతుంది ? మైలేజ్ ఎంత ఇస్తుంది ?  |   ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ధ‌ర‌, ఫీచ‌ర్లే ఇవే.. ఒక్క‌సారి ఛార్జింగ్ పెడితే 150 కిలోమీట‌ర్లు  |   మామూలు జ‌లుబుగా క‌రోనా వైర‌స్ ?  |   భార‌త్ బ‌యోటెక్ కొత్త క‌రోనా వ్యాక్సిన్‌.. ఇది చాలా స్పెష‌ల్‌  |   మోహ‌న్ బాబు కుటుంబానికి గుడ్ న్యూస్ చెప్పిన జ‌గ‌న్ ?  |  

గోదావ‌రి ప్ర‌జ‌ల పాలిట‌ అప‌ర భ‌గీరథుడు కాట‌న్ దొర జ‌యంతి నేడు

సాయం చేసిన వారిని ఎన్నేళ్ల‌యినా, ఎన్ని జ‌న్మ‌లైనా మ‌రిచిపోము. ఇందుకు ఉదాహ‌ర‌ణ స‌ర్ ఆర్థ‌ర్ కాట‌న్‌. గోదావ‌రి జిల్లాల‌ను స‌శ్యశ్యామ‌లం చేసిన ఆయ‌నను గోదావ‌రి ప్ర‌జ‌లు గుండెల్లో పెట్టుకున్నారు. ఊరూరా విగ్ర‌హాలు పెట్టి కొలుచుకుంటున్నారు. ఎక్క‌డైనా దొర అని భ‌యంతో పిలుస్తారు కానీ కాట‌న్‌ను మాత్రం ప్ర‌జ‌లు ప్రేమ‌, ఆప్యాయ‌త‌తో కాట‌న్ దొర అని పిలుచుకుంటారు. ఒక‌ప్పుడు అయితే అతివృష్టి లేదా అనావృష్టితో క‌ట‌క‌ట‌లాడిన గోదావ‌రి జిల్లాల‌కు సాగునీరు అందించి సమూలంగా మార్చిన స‌ర్ ఆర్థ‌ర్ కాట‌న్ జ‌యంతి నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గురించి, ఆయ‌న తెలుగువారికి చేసిన సేవ‌ల గురించి ఒక సారి చూద్దాం.

స‌ర్ ఆర్థ‌ర్ కాట‌న్ మే 15, 1803లో ఇంగ్లాడ్‌లో జ‌న్మించారు. ఆయ‌న తండ్రి హెన్రీ కాల్వేలీ కాట‌న్‌. ప‌ద‌కొండు మంది సంతానంలో ఆర్థ‌ర్ కాట‌న్ ప‌దోవారు. ఆర్థ‌ర్ 15వ యేట‌నే 1818లో మిలిట‌రీలో చేరి ఈస్ట్ ఇండియా కంపెనీలో ఆర్టిల‌రీ, ఇంజ‌నీరింగ్ విభాగాల్లో శిక్ష‌ణ పొందారు. రాయ‌ల్ ఇంజ‌నీర్స్ ద‌ళంలో ప‌ని చేయ‌డానికి 18 ఏళ్ల వ‌య‌స్సులో భార‌త్‌లో అడుగుపెట్టారు. మ‌ద్రాస్ రాష్ట్రంలో ఉద్యోగంలో చేరారు. అప్ప‌టికే ఆయ‌న ఇంజ‌నీరింగ్‌లో ప్రావీణ్య‌త సాధించారు. దీంతో ద‌క్షిణాదిన నీటి పారుద‌ల శాఖ‌కు ఇంజ‌నీర్‌గా నియ‌మితుల‌‌య్యారు.

మొద‌ట ఆయ‌న తంజావూరు జిల్లాలోని కొలెరూన్ న‌దిపై ఆన‌క‌ట్ట నిర్మించడంలో భాగ‌మ‌య్యారు. దీంతో తంజావూరు జిల్లా ఆహార ధాన్యాల ఉత్ప‌త్తిలో అప్ప‌ట్లో దేశంలోనే అగ్ర‌స్థానంలో నిలిచింది. కావేరీ న‌ది నీటిని వివిధ జిల్లాల ప్ర‌జల‌కు అందించేందుకు ఆన‌క‌ట్ట‌లు నిర్మించారు. త‌ర్వాత రెండేళ్ల పాటు అనారోగ్యంతో ఇంగ్లాండ్ వెళ్లిన కాట‌న్ త‌ర్వాత తిరి మ‌ద్రాస్ వ‌చ్చారు. ఈ సారి ఆయ‌న అప్ప‌టి మ‌ద్రాస్ రాష్ట్రంలోనే భాగ‌మైన గోదావ‌రి జిల్లాల‌పై ఆర్థ‌ర్ కాట‌న్ దృష్టి పెట్టారు. 1840కు ముందు గోదావ‌రి జిల్లాల్లో అతివృష్టి లేదా అనావృష్టితో ప్ర‌జ‌లు ఇబ్బంది ప‌డేవారు.

దీంతో గోదావ‌రిని ఒడిసిప‌ట్టి అక్క‌డి ప్ర‌జ‌ల‌కు క‌రువు, వ‌ర‌ద‌లు దూరం చేయాల‌ని కాట‌న్ సంక‌ల్పించారు. ఇందుకోసం ఆయ‌న గోదావ‌రి న‌దిపై ద‌వ‌ళేశ్వ‌రం వ‌ద్ద ఆన‌క‌ట్ట నిర్మించాల‌ని అప్ప‌టి పాల‌కుల‌కు ప్ర‌తిపాదించారు. 1846లో ఆన‌క‌ట్ట నిర్మాణానికి అప్ప‌టి ప్ర‌భుత్వం అంగీక‌రించింది. ఈ ఆన‌క‌ట్ట నిర్మాణం కోసం స్వ‌యంగా కాట‌న్ దొర చొర‌వ తీసుకున్నారు. 1847లో ప్రారంభ‌మైన ద‌వ‌ళేశ్వ‌రం ఆన‌క‌ట్టు ప‌నులు 1852లో పూర్త‌య్యి గోదావ‌రి ప్ర‌జ‌ల‌కు సాగునీరు అందుబాటులోకి వ‌చ్చింది. ఇవాళ గోదావ‌రి జిల్లాలు ఎక్క‌డ చూసినా ప‌చ్చ‌ని పంట‌ల‌తో క‌నిపిస్తున్నాయంటే అందుకు ఆనాడు కాట‌న్ దొర చేసిన కృషి ఫ‌లిత‌మే.

అందుకే ప్రజ‌లంతా ఆయ‌న‌ను అప‌ర భ‌గీరథుడిగా భావిస్తారు. గోదావ‌రి జిల్లాల్లో ఏ ఊరిలో చూసినా స‌ర్ ఆర్థ‌ర్ కాట‌న్ విగ్ర‌హాలు క‌నిపిస్తుంటాయి. ఆయ‌న‌ను దైవంతో స‌మానంగా ఇక్క‌డి ప్ర‌జ‌లు భావిస్తారు. గోదావ‌రిలో పుణ్య‌స్నానాలు ఆచ‌రించిన వారు.. నిత్య గోదావరీ స్నాన పుణ్యదోయోమహమతిః..
స్మరామ్యాంగ్లేయ దేశీయం కాటనుం తం భగీరథం అనే శ్లోకం చ‌దువుతారు. ఒక ఆంగ్లేయుడి పేరుతో శ్లోకం చ‌ద‌వ‌డం అంటే ఆయ‌న‌ను గోదావ‌రి ప్ర‌జ‌లు ఎంత గొప్ప‌గా కీర్తిస్తున్నారో అర్థం చేసుకోవ‌చ్చు. మాకు గోదావ‌రిలో స్నానం చేసే పుణ్యాన్ని క‌లిపించిన భ‌గీర్థుడు కాట‌న్ దొర అంటూ ఈ శ్లోకం ద్వారా గుర్తు చేసుకుంటారు.

కాట‌న్ సేవ‌ల‌కు గుర్తుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఆయ‌న నిర్మించిన ధ‌వ‌ళేశ్వ‌రం ఆన‌క‌ట్ట ప‌క్క‌నే స‌ర్ ఆర్థ‌ర్ కాట‌న్ మ్యూజియం కూడా నిర్మించింది. ఆన‌క‌ట్ట నిర్మాణ స‌మ‌యంలో ఆయ‌న నివ‌సించిన రెండంత‌స్థుల భ‌వ‌నంలోనే ఈ మ్యూజియం ఉంది. కాట‌న్ దొర వాడిన వ‌స్తువులు, ఆన‌క‌ట్ట నిర్మాణానికి వాడిన వస్తువులు ఇక్క‌డ ప్ర‌జ‌లు సంద‌ర్శించ‌వ‌చ్చు. కేవ‌లం గోదావ‌రి ప్ర‌జ‌ల‌కే కాకుండా ద‌క్షిణ భార‌తీయుల‌కు సాగు నీరు అందించేందుకు కాట‌న్ ఎంతో కృషి చేశారు. 1860లో ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన ఆయ‌న ఇంగ్లాండ్ వెళ్లిపోయారు. రైతుల కోసం ఆయ‌న చేసిన సేవ‌ల‌ను గుర్తించిన ఇంగ్లాండ్ ప్ర‌భుత్వం ఆయ‌న‌కు స‌ర్ బిరుదును బ‌హుక‌రించింది.

ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన త‌ర్వాత కూడా ఆయ‌న ఇంగ్లాండ్ నుంచి భార‌త్ వ‌చ్చి సోన్ లోయ‌లో ప్రాజెక్టుల నిర్మాణానికి స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చి వెళ్లారు. త‌న 96వ యేట 1899 జూలు 24న‌ ఆరోగ్యం క్షీణించి ఇంగ్లాండ్‌లో ఆయ‌న తుదిశ్వాస విడిచారు. ఎక్క‌డో ఇంగ్లాండ్‌లో పుట్టి మ‌న ప్ర‌జ‌ల‌కు సాగు నీరు అందించి క‌ష్టాలు తీర్చిన మ‌హ‌నీయుడు స‌ర్ ఆర్థ‌ర్ కాట‌న్‌. ఇప్పుడే కాదు గోదావ‌రి జిల్లాలు ప‌చ్చ‌గా ఉన్న‌న్ని రోజులూ కాట‌న్ దొర‌ను ప్ర‌జ‌లు గుండెల్లో పెట్టుకొని కొలుచుకుంటారు.

Related News