ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖకు సంబంధించి మరో వివాదం రాజుకుంది. అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం ఘటనకు సంబంధించి ఇక వివాదం చల్లారకముందే మరో వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. బెజవాడ దుర్గమ్మ రథానికి ఉండే మూడు వెండి సింహాల బొమ్మలు మాయమయ్యాయి. ఈ రథానికి నాలుగు వైపులా నాలుగు వెండి సింహాలు ఉంటాయి. ఇందులో మూడు మాయమయ్యాయి.
దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తున్న సమయంలో ఇటువంటి ఘటన జరగడం గమనార్హం. ఈ విషయం తెలుసుకున్న దేవాదయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదయ శాఖ కమిషనర్ అర్జున్రావుతో కలిసి దుర్గమ్మ ఆలయం వద్దకు చేరుకొని రథాన్ని పరిశీలించారు. అనంతరం దేవాదయ ఈవో నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం లోపు ఈ ఘటనపై నివేదిక ఇస్తామని వెల్లంపల్లి ప్రకటించారు. ఆలయాల్లో రథాల భద్రతపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.
కాగా, దుర్గమ్మ రథం వెండి సింహాల మాయంపై బీజేపీ కూడా సీరియస్ అయ్యింది. ఈ ఘటన గురించి తెలియగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇంద్రకీలాద్రి చేరుకొని రథాన్ని పరిశీలించారు. దేవాదయ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో చాలా చోట్లు ఇటువంటి సంఘటనే జరుగుతున్నట్లు సోము వీర్రాజు పేర్కొన్నారు. వెంటనే ఈ ఘటనపై విచారణ జరిపి దోషులను శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.