అధిక వడ్డీలకు అప్పులిస్తున్న ఆన్ లైన్ సంస్థలు తిరిగి చెలించని వారికి చుక్కలు చూపిస్తున్నారు. ఇలా అప్పు చేసి తీర్చలేక ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చూస్తున్నాం. తాజాగా ఆన్ లైన్ అప్పు సిద్ధిపేట కు చెందిన మహిళా అధికారిని ప్రాణాలు తీసింది. అవమాన భారంతోనే తమ సోదరి ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి సోదరుడు పోలీసులను ఆశ్రయించాడు.
వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని నంగునూరు మండలం రాజగోపాలపేట కు చెందిన మౌనిక(24) ఒక ప్రభుత్వ ఉద్యోగిని. స్థానికంగా అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ గా పనిచేస్తుంది. అయితే ఇటీవల తన తండ్రి వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయాడు. తన కుటుంబానికి ఆర్థికంగా సహాయపడాలనుకున్న ఆమె స్నాప్ ఇట్ అనే యాప్ ద్వారా రూ. 3 లక్షలు అప్పు తీసుకున్నారు. కానీ తగిన సమయంలో వాయిదాలు చెల్లించలేకపోయింది.
దీంతో సదరు యాప్ నిర్వాహకులు ఆమెను డీఫాల్టర్ గా గుర్తించారు. ఆమె ఫోన్ నంబర్, ఫోటో పేరుతో కూడిన మౌనిక వివరాలను ఆమె కాంటాక్ట్ లిస్టులో ఉన్న వారందరికీ అప్పు ఎగ్గొట్టిందని తెలుపుతూ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసారు. ఈ విషయం ఆమె సహోద్యోగులు, బంధువులతో పాటుగా ఆమె పని చేస్తున్న కార్యాలయం ఉన్నతాధికారులకు కూడా తెలిసిపోయింది. ఈ అవమానం భరించలేకపోయింది మౌనిక కొద్ది రోజుల పాటు ఇంట్లోనే ఉంటూ వచ్చింది. ఇటీవల ఆన్ లైన్ సంస్థ చేసిన పని తీవ్ర మనస్తాపం చెందిన ఆమె ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.