ప్రస్తుతం ఎక్కడ చూసినా ఓటీటీల హవా నడుస్తుంది. ఎంటర్టైన్మెంట్ కోరుకునే యూజర్ల కోసం అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్ లాంటి ప్లాట్ ఫార్మ్ లు అందుబాటులో ఉన్నాయి. అయితే మన దగ్గర అమెజాన్ కన్నా నెట్ ఫ్లిక్స్ కు కొంచెం ఎక్కువ మంది యూజర్లు ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా తమ యూజర్లకు నెట్ ఫ్లిక్స్ భారీ షాకిచ్చింది. ఇకపై యూజర్ పాస్ వర్డ్ షేరింగుల వంటివి చేయకుండా అడ్డుకట్ట వేయబోతుంది.
ఇప్పటి వరకు ఎవరైనా ఒక యూజర్ నెట్ ఫ్లిక్స్ అకౌంట్ ను వాడుతుంటే వారి ద్వారా ఐడీ, పాస్ వర్డ్ లను షేర్ చేసుకుని మనకు నచ్చిన షోలన్నీ చూసేసేవాళ్ళం. అయితే భవిష్యత్తులో మీకు ఆ ఆప్షన్ ఉండకపోవచ్చు. ప్రపంచంలోనే నంబర్ వన్ ఓటిటీ ప్లేట్ ఫార్మ్ అయిన నెట్ ఫ్లిక్స్ పాస్ వర్డ్ షేరింగ్ లను అరికట్టడానికి కొత్త నిర్ణయం తీసుకుంటుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఇకపై నెట్ ఫ్లిక్స్ అకౌంట్ ను ఒకటికన్నా ఎక్కువ మంది ఉపయోగించాలంటే వారంతా ఒకే కుటుంబానికి సంబందించిన వారై ఉండాలి.
ఇతరులకు అనుమతులు ఉండవు. ఆ విషయాన్ని వెరిఫై చేసిన తర్వాతనే నెట్ ఫ్లిక్స్ యూజర్లకు అనుమతులు ఇస్తుంది. ఇప్పటికే యూజర్లను లొకేషన్ తెలపాల్సిందిగా నెట్ ఫ్లిక్స్ నుంచి మెసేజిలు వస్తున్నట్టుగా కొందరు చెప్తున్నారు. ఆ తర్వాత వెరిఫికేషన్ కోసం నెట్ ఫ్లిక్స్ యూజర్ మొబైల్ నంబర్, లేదా ఈ మెయిల్ ఐడీ ద్వారా వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది.
కొంత సేపటి వరకు ఈ వెరిఫికేషన్ మెసేజ్ ను డిలే చేసినా.. మళ్ళీ మళ్ళీ మెసేజ్ చూపుతూనే ఉంటుంది. కాబట్టి ఇక వెరిఫికేషన్ చేయక తప్పదన్నమాట. ఇక యూజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకువస్తున్న నెట్ ఫ్లిక్స్ రెండు రోజుల ఫ్రీ ట్రయిల్ ను కూడా గతేడాది అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.