ఏపీ మూడో విడత పోలింగ్ లో నారా చంద్రబాబు నాయుడుకు సొంత నియోజకవర్గంలోనే ఊహించని షాక్ తగిలింది. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి బాబు ప్రాతిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగురవేసింది. మూడు దశాబ్దాలుగా టీడీపీకి కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కుప్పకూలింది. మూడో విడత పోలింగ్ లో భాగంగా 80 శాతానికి పైగా వైసీపీ మద్దతుదారులు గెలుపొందారు.
కుప్పం నియోజకవర్గం పరిధిలో మొత్తం 89 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ 74 చోట్ల విజయం సాధించగా టీడీపీ 14 పంచాయతీ స్థానాలను మాత్రమే గెలుచుకుంది. నియోగకవర్గంలోని గుడుపల్లెలో ఉన్న 18 స్థానాలలో 13 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది.
శాంతిపురం 23 స్థానాలలో 20 స్థానాలను గెలుచుకుంది. అలాగే రామకుప్పం మండలంలో ఉన్న 22 పంచాయతీల్లో 20 వైసీపీ మద్దతుదారులకు దక్కాయి. దీంతో చంద్రబాబు నియోజకవర్గంలో వైసీపీ విజయ ఢంకా మోగించింది. బుధవారం నాడు 2,639 పంచాయతీల్లో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో వైసీపీ మద్దతుదారులు 2,442 పంచాయతీ స్థానాల్లో విజయం సాధించారు. టీడీపీ 501 స్థానాలను గెలుచుకుంది.