సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించే సోనూసూద్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హీరోగా ప్రశంసలు అందుకుంటున్నారు. మానవత్వంతో ఆయన చేతికి ఎముకే లేదన్నట్లుగా చేస్తున్న సేవా కార్యక్రమాలకు దేశప్రజలంతా ఆయనను మానవరూపంలో ఉన్న దేవుడిగా చూస్తున్నారు. దేశంలో కరోనాను నియంత్రించడానికి ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో వలస కార్మికులు ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. ఉత్తరప్రదేశ్, బిహార్ నుంచి వెళ్లి ముంబైలో చిన్నాచితక పనులు చేసుకునే వలస కార్మికులు తమ స్వస్థలాలకు నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఆ సమయంలో ఏ హీరో, మరే సెలబ్రిటీ స్పందించలేదు కానీ సినీ విలన్ సోనూసూద్ స్పందించారు. వలస కార్మికులకు సోనూ అండగా నిలిచాడు. తన స్వంత ఖర్చులతో బస్సులు, రైళ్లను ఏర్పాటు చేసి వారిని స్వస్థలాలకు పంపించారు. దీంతో ఒక్కసారిగా సోనూసూద్ పేరు మార్మోగిపోయింది. ఇదొక్కటే కాదు దేశంలో ఎక్కడ ఎవరూ సహాయం కోరినా సోనూసూద్ వెంటనే స్పందిస్తున్నారు.
ఎంతో మందికి స్వయం ఉపాధికి సహాయం చేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న చాలామందిని ఆదుకొని కొత్త జీవితం ప్రసాదించారు. ఈ క్రమంలో ఆయన సాయం పొందిన వారు సోనూసూద్‌ను దైవంలా భావిస్తున్నారు. దేశ ప్రజలంతా సోనూను చాలా గౌరవిస్తున్నారు. కానీ, మహారాష్ట్రలోని అధికార శివసేన పార్టీ మాత్రం సోనూసూద్‌పై కక్ష కట్టిందనే వార్తలు వస్తున్నాయి.
ముంబైలోని జూహు ప్రాంతంలో సోనూసూద్‌కు ఏడంతస్థుల భవనం ఉంది. ఈ భవనాన్ని అనుమతులు లేకుండా హోటల్‌గా మార్చారని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) సోసూసూద్కు గత ఏడాది అక్టోబరు 27న నోటీసులు ఇచ్చి నెల రోజుల్లో జవాబు ఇవ్వాలని కోరింది. సోనూసూద్ నుంచి జవాబు రాలేదని, అతడిపై చర్యలు తీసుకోవాలని బీఎంసీ అధికారులు పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. అయితే, తనకు అన్ని అనుమతులు ఉన్నాయని, ఒకే ఒక అనుమతి రావాల్సి ఉందని, అది కూడా త్వరలో వస్తుందని సోనూసూద్ చెబుతున్నారు.
బీఎంసీ అధికారులు సోనూసూద్‌పై ఫిర్యాదు చేయడం వెనుక అధికార శివసేన పార్టీ ఉందని సోనూసూద్ అభిమానులు ఆరోపిస్తున్నారు. గతంలోనూ సోనూసూద్‌పై శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. వలస కార్మికులను ఆదుకుంటున్న సమయంలో సోనూసూద్ వెనుక ప్రతిపక్ష బీజేపీ ఉందని శివసేన ఆరోపించింది. శివసేన ప్రభుత్వం వలస కార్మికులకు ఏమీ చేయడం లేదనే బదనాం చేసేందుకు సోనూసూద్ ద్వారా బీజేపీ గేమ్ ఆడుతోందని శివసేన అప్పట్లో విమర్శించింది. అప్పటి నుంచే శివసేనకు సోనూసూద్ మీద కక్ష ఉందని, అందుకే ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నారని సోనూ అభిమానులు ఆరోపిస్తున్నారు.