మహాశివుడు లింగాకృతిని పొందిన రోజునే శివరాత్రిగా జరుపుకుంటాం. ఈ పర్వదినం రోజున భక్తి శ్రద్దలతో పరమేశ్వరుడిని పూజిస్తే జీవితంలో దేనికీ లోటు ఉండదని భక్తుల నమ్మకం. శివరాత్రి రోజున తెలిసీ తెలియక చేసే కొన్ని పొరపాట్లు దోషాలని కలుగజేస్తాయి. అసలు శివరాత్రి రోజున ఆచరించాల్సిన నియమాలు, పూజా విధానం ఏమిటి? చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం..
శివరాత్రి మహా పర్వదినం రోజున తెల్లవారుజామునే నిద్రలేవాలి. తలంటు స్నానం చేయాలి. ఈ పర్వదినాన పూజా మందిరానికి, ఇంటికి తోరణాలు కట్టి అలంకరించుకోవాలి. శివరాత్రి రోజున తెల్లటి బట్టలను ధరించడం శ్రేయస్కరం. శివాలయానికి వెళ్లే ముందు వెంట్రుకలకు దువ్వెన వాడకూడదు. ఉదయం 8 గంటల లోపే శివాలయాన్ని దర్శించాలి. ఆలయానికి వెళ్లలేని వారు ఇంటి దగ్గరే పూలు, బిల్వ దళాలు, పంచామృతాలతో శివుడిని అభిషేకించవచ్చు.
మారేడు దళాలతో ఇంటిలో, ఆలయంలో శివుడిని ఆరాధించాలి. ఈ రోజున జాగరణ, ఉపవాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అయితే అనారోగ్యంతో బాధపడేవారు, ఉపవాసం చేయలేని వారు కఠిన దీక్షను చేయకూడదు. పండ్లు, పాల లాంటి సాత్విక ఆహారం తీసుకోవాలి. మగవారు గర్భగుడికి వెళ్ళేటప్పుడు, శివుడిని అభిషేకించి సమయంలో చొక్కాలకు బదులుగా కండువాలను ధరించాలి. కచ్చితంగా ఒక చెంబెడు నీటిని ఇంటి నుంచి తీసుకెళ్లి శివుడిని అభిషేకించాలి. శివుడిని అభిషేకించడానికి గేదె పాలకన్నా ఆవు పాలు శ్రేష్టమైనవి. అభిషేకానికి ఉపయోగించే సమయంలో పాల ప్యాకెట్లను నోటితో తెంచి ఆ పాలను అభిషేకించరాదు.
మహిళలు అభిషేకం చేసే సమయంలో శివలింగాన్ని తాకకూడదు. ఆ సమయంలో మన శరీరం నుంచి వచ్చే చెమట గాని వెంట్రుకలు గాని శివ లింగం పడకూడదు. శివరాత్రి రోజున మొగలిపువ్వును ఆలయానికి తీసుకెళ్లడం, స్వామివారికి నివేదించడం లాంటివి అస్సలు చేయకూడదను. శివరాత్రి రోజున భార్యాభర్తలు సంభోగం చేసినా, మద్యం, మాంసం తిన్నా పాపం మూటగట్టుకున్నట్టేనని శాస్త్రం చెప్తుంది. ఆరోజున ఒక్కరికైనా అన్నదానం, దాన ధర్మాలు చేయడం చాలా మంచిది. శివుడికి చందనం, విభూధిని పెడితే సరిపోతుంది. ఎరుపు రంగులో ఉండే కుంకుమను పెడితే అది ఆయనలో వేడిని పెంచుతుంది.
మహాదేవుడికి నైవేద్యంగా పొంగలి, బూరెలు, గారెలు, అరటి, జామ పళ్ళను పెట్టవచ్చు. శివ పూజ చేసే సమయంలో శివ అష్టోత్తరం, శివ పంచాక్షరీ మంత్రాన్ని చదవాలి. ఈరోజున ఉపవాసం ఉండటం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. శివుడి అభిషేకానికి ఉపయోగించిన నీటిని ఇంటికి నలుమూలలా చల్లుకోవడం చాలా మంచిది. వ్యాపార స్థలంలో అభిషేక జలాన్ని తప్పకుండా చల్లండి. శివుడికి మారేడు దళాలు ఎంతో ఇష్టమైనవన్న విషయం తెలిసిందే.
అలాగే నాగ మల్లి పూలంటే కూడా శివుడికి ఎంతో ఇష్టం. ఈ పుష్పాలతో శివరాత్రి రోజున ఇంటిని పూజిస్తే శివుడి అనుగ్రహం కలుగుతుంది. శంఖం పూలు, మల్లెలు, సంపెంగ పూలు, జిల్లేడు పుష్పాలను కూడా ఉండేట్టు చూసుకోవాలి. శివుడిని పూజించిన పూలను మహిళలు తలలో ధరిస్తే పూర్వ జన్మలో పాప కర్మలు సైతం నశిస్తాయి. ఈ విధంగా శివుడినిని ఆరాధించడం వలన సకల శుభాలు కలుగుతాయి.