క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. మన కథలు, మన ఊరిలో కథలు చెబుతున్నట్లుగా న్యాచురల్‌గా శేఖర్ కమ్ముల సినిమాలు ఉంటాయి. అందుకే శేఖర్ కమ్ముల సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తుంటారు. సినిమాలను తెరకెక్కించడంలో తన మార్క్ చూపించే శేఖర్ కమ్ముల సినిమాల లొకేషన్స్ ఎంపికలోనూ ప్రత్యేకత చాటుకుంటున్నారు. లోకేషన్స్ విషయంలో చాలా కాలంగా తెలుగు సినిమాల్లో ఉన్న ఒక సంప్రదాయాన్ని శేఖర్ కమ్ముల మార్చేస్తున్నారు.
తెలుగు సినిమాల్లో గ్రామీణ వాతావరణం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. ఇలా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సినిమాల్లో నూటికి 99 సినిమాలు ఆంధ్రప్రదేశ్‌లో చిత్రీకరిస్తారు. ఇది ఒక సంప్రదాయంగా మారిపోయింది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు, కోనసీమలో ఎక్కువగా విలేజ్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు తెరకెక్కిస్తారు. కొబ్బరి తోటలు, వరిపొలాలు, కాలువలు, గోదావరి నదితో అందంగా ఉంటాయి ఈ గ్రామాలు. దీంతో చాలా రోజులుగా మన తెలుగు దర్శకులు గ్రామాల్లో షూటింగ్ కోసం అక్కడి లొకేషన్లకే వెళుతుంటారు.
అందుకే మనం ఏ విలేజ్ బ్యాక్‌డ్రాప్ సినిమా చూసినా లొకేషన్లు, పేర్లు కూడా ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామాలవే ఉంటాయి. ఎప్పుడో ఒకటి మాత్రం తెలంగాణ పల్లెల్లో తీసినవి ఉంటాయి. అయితే, శేఖర్ కమ్ముల మాత్రం ఈ ట్రెండ్ మారుస్తున్నారు. అందమైన తెలంగాణ పల్లె వాతావరణాన్ని ఆయన తన సినిమాల్లో చూపించే ప్రయత్నం మొదలుపెట్టారు. ఫిదా సినిమా మొత్తం నిజామాబాద్ జిల్లా బాన్స్వాడలో చిత్రీకరించారు.
ఎంతో అందంగా ఈ ప్రాంత లొకేషన్లను సినిమాలో చూపించారు శేఖర్ కమ్ముల. తెలంగాణ గ్రామాల్లో తీసిన సినిమా కావడంతో సహజంగానే తెలంగాణ యాస, భాష, సంస్కృతి ఫిదా సినిమాలో కనిపించింది. ఈ సినిమాపై, లొకేషన్స్, సినిమాలో యాస పట్ల అన్ని ప్రాంతాల ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఫిదా తర్వాత ఇప్పుడు నాగచైతన్య, సాయి పల్లవి జంటగా లవ్ స్టోరీ అనే సినిమా తీస్తున్నారు శేఖర్ కమ్ముల. ఈ సినిమాలోనూ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో కొంత స్టోరీ ఉంటుంది. ఈ సీన్స్‌ను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, పరసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు.
ఆర్మూర్ కూడా అందమైన పట్టణం. అర్మూర్ పరిసర గ్రామాలన్నీ పంటపొలాలతో అందంగా కనిపిస్తాయి. దీంతో శేఖర్ కమ్ముల ఈ లొకేషన్స్‌ను ఎంచుకున్నారు. గ్రామాల్లో షూటింగ్ అంటే ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్లాల్సిందే అనే అభిప్రాయాన్ని శేఖర్ కమ్ముల మారుస్తున్నారు. తెలంగాణలోనూ అందమైన పల్లె సౌందర్యం ఉంటుందని తెలుగు ప్రేక్షకులకు చూపిస్తున్నారు.