ఊహాగానాలకు తెరపడుతుంది. అంతా భావించినట్టే తెలంగాణాలో కొత్త పార్టీ దిశగా వైఎస్ షర్మిల అడుగులు వేస్తున్నారు. అయితే పార్టీపై అధికారికంగా షర్మిల ప్రకటించినప్పటికీ అందుకు సంబందించిన స్పష్టమైన సంకేతాలను ఇచ్చారు. నగరంలో ఈరోజు జగిత్యాల, నల్గొండకు చెందిన ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా షర్మిల కీలక ప్రకటన చేసారు.
”తెలంగాణలో వైఎస్సార్ హయాంలో ప్రతి రైతు రాజులా ఉన్నాడు. ఇప్పుడు ఆయన లేని లోటు స్పష్టంగా తెలుస్తుంది. తెలంగాణలో రాజన్న రాజ్యం ఎందుకు లేదు.. రాష్ట్రంలో రాజన్న రాజ్యం సాధించాలి అది నాతోనే సాధ్యం అందుకే ఈ ఆత్మీయసమ్మేళనం ఈ సమావేశం ద్వారా క్షేత్ర స్థాయిలో పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నానంటూ” కీలక వ్యాఖ్యలు చేసారు. దీంతో తెలంగాణాలో షర్మిల పార్టీ దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తుంది.
అయితే వైసీపీపై ఆంధ్ర పార్టీ ముద్ర ఉండటంతో ఇప్పుడు తెలంగాణలో కొత్త పార్టీతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్టుగా సమాచారం. వైఎస్ఆర్, తెలంగాణ పేర్లు కలిసి వచ్చేలా పార్టీ పేరు డిసైడ్ చేయనున్నారని సమాచారం అందుతుంది. అయితే పార్టీకి దివంగతనేత వైఎస్సార్ – తెలంగాణ పేరు కలిసి వచ్చేలా ‘వైఎస్సార్ టీపీ’ అనే పేరును పరిశీలిస్తున్నారని త్వరలోనే పార్టీ పేరుపై కీలక ప్రకటన ఉండనుందని సమాచారం అందుతుంది.