కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులను ప్రైవేటీకరిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా బీఎస్ఎన్ఎల్, విశాఖ స్టీల్ ప్లాంట్, ఎయిర్ ఇండియా సంస్థలను వంద శాతం ప్రైవేటు పరం చేయడానికి కేంద్రం సిద్ధమైంది.
తాజాగా హైద్రాబాద్ తో పాటుగా ఢిల్లీ, ముంబై, బెంగుళూరు విమానాశ్రయాలను అమ్మకానికి పెట్టింది. ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) వాటాలు కలిగి ఉన్న విమానాశ్రయాలను పూర్తిగా ప్రైవేటీకరించే విధంగా మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ సంస్థలలోని వాటాలను విక్రయించడం ద్వారా రూ. 2.65 లక్షల కోట్లను సమీకరించడమే లక్ష్యంగా కేంద్రం ముందుకు వెళ్తున్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో మొదటి దశ ప్రైవేటీకరణలో భాగంగా మంగుళూరు, లక్నో, అహ్మదాబాద్, జైపూర్, గౌహతి, విమానాశ్రయాల కాంట్రాక్టులను అదానీ గ్రూపుకు అప్పగించింది. ఇక 2020- 2021 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 13 విమానాశ్రయాలను ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించుకుంది. అందులో నాలుగింటిపై ఇప్పుడు నిర్ణయం తీసుకోనుంది.
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏఏఐ, రాష్ట్ర ప్రభుత్వానికి కలిపి 26 శాతం వాటా ఉంది. దేశంలో కొత్తగా మౌలిక వసతులను కల్పించడానికి భారీగా నిధుల కొరత ఉందని బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానంచిన విషయం తెలిసిందే. ఆ నిధులను సమీకరించడానికి ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించడమే కేంద్రం ముందున్న ఏకైక మార్గమని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు.