తెలంగాణ పీసీసీ పదవిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. ఇప్పుడు ఆ పార్టీకి సంబధించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. తెలంగాణకు పీసీసీ అధ్యక్షుడితో పాటుగా మరో కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ ను కూడా నియమించనున్నట్టుగా తెలుస్తుంది.ఈ మేరకు ఢిల్లీ అధిష్టానం కసరత్తులు మొదలుపెట్టిందని సమాచారం.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా అధిష్టానం అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మరో నేతను నియమించనుంది . పీసీసీ అధ్యక్షుడి నియామకం అయిన వెంటనే ఈ విషయంపై ప్రకటన ఉండనుందని సమాచారం.
కాగా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన నేత షబ్బీర్ ఆలీకి వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించనున్నారట. దాదాపు ఈ పదవికి ఆయన పేరు ఖరారైనట్టే అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలోకి యువజన నాయకుడిగా అడుగు పెట్టిన షబ్బీర్ అలీ అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా గెలుపొందారు.
అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక పదవులను చేపట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కీలకమైన విద్యుత్ శాఖా మంత్రిగా కూడా షబ్బీర్ అలీ పనిచేసారు. ఆ తర్వాత 2009, 2014, 2018 ఎన్నికల్లో పరాజయం పొందారు. శాసన మండలి సభ్యుడిగా, మండలి విపక్ష నేతగా కూడా షబ్బీర్ అలీ పని చేసారు.