కోవీషీల్డ్ కరోనా వ్యాక్సిన్ ధర భారీగా పెంచుతూ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్న నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం మరింత వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సంస్థలు 50 శాతం వ్యాక్సిన్లను నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి లేదా ఓపెన్ మార్కెట్లో అమ్ముకోవచ్చని కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది.
దీంతో రాష్ట్ర ప్రభుత్వాలకు, ఓపెన్ మార్కెట్లలో సరఫరా చేసే తమ వ్యాక్సిన్ ధరకు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పెంచేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్క డోసుకు రూ.400, ప్రైవేటు ఆసుపత్రులకు ఒక్క డోసుకు రూ.600 చొప్పును కోవీషీల్డ్ వ్యాక్సిన్ను విక్రయించనున్నట్లు సీరమ్ సంస్థ ప్రకటించింది. ఆస్ట్రాజెనికా – ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ కలిసి అభివృద్ధి చేసిన కోవీషీల్డ్ వ్యాక్సిన్ను మన దేశంలో పూణేకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటివరకు ఒక్క డోసుకు వ్యాక్సిన్ను రూ.150కి కేంద్ర ప్రభుత్వానికి సీరమ్ సంస్థ సరఫరా చేస్తోంది. కేంద్రమే ఈ వ్యాక్సిన్లను రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిస్తోంది. ఇప్పటివరకు కోవీషీల్డ్, కోవాగ్జిన్ వ్యాక్సిన్లు కేవలం కేంద్ర ప్రభుత్వానికి, ఇతర దేశాలకు మాత్రమే ఈ వ్యాక్సిన్ సరఫరా అవుతోంది. ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు అవసరం మేరకు నేరుగా కొనుగోలు చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇక నుంచి తమ వ్యాక్సిన్ డోసులను 50 శాతం కేంద్రానికి, మరో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ ఆసుపత్రులకు అందిస్తామని సీరమ్ సంస్థ ప్రకటించింది.
వచ్చే రెండు నెలల్లో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచి పెద్ద ఎత్తున వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తామని సీరమ్ సంస్థ వెల్లడించింది. నాలుగైదు నెలల తర్వాత వ్యాక్సిన్ను రీటైల్ మార్కెట్లోనూ అందుబాటులోకి తీసుఉవస్తామని ప్రకటించింది. కాగా, హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న కోవాగ్జిన్ ధర పెంపుపై మాత్రం ఇంతవరకు ఎటువంటి ప్రకటన రాలేదు. ఈ సంస్థ కూడా వ్యాక్సిన్ ధరను పెంచుతుందా అనేది చూడాల్సి ఉంది.