దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. సెంకడ్ వేవ్ వైరస్ విజృంభిస్తోంది. ఫస్ట్ వేవ్ కంటే వేగంగా వైరస్ వ్యాపిస్తోంది. గతంలో ఇంట్లో ఒకరికి వైరస్ సోకితే మిగతా వారికి సోకే అవకాశాలు తక్కువగానే ఉండేవి. కానీ, ఇప్పుడు ఇంట్లో ఒక్కరికి వైరస్ సోకితే మిగతా కుటుంబసభ్యులకు కూడా వస్తోంది. ఈ నేపథ్యంలో కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సెకండ్ వేవ్ కరోనా బారిన పడకుండా ఉండొచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఇప్పటివరకు మనం కరోనా బారిన పడకుండా మాస్క్లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లు వాడటం చేస్తున్నాం. అయితే, గత ఆరు నెలలుగా కరోనా కేసులు తగ్గడం వల్ల ప్రజల్లో ఉదాసీనత పెరిగిందని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం మానేశారని, అందువల్లనే సెకండ్ వేవ్ ఇంత వేగంగా విజృంభిస్తోందని నిపుణులు చెబుతున్నారు.
కాబట్టి, ఇప్పుడు మళ్లీ కరోనా నిబంధనలు కచ్చితంగా పాటిస్తే ఎంత వేగంగా సెకండ్ వేవ్ వ్యాప్తి తగ్గిపోతోందని అంటున్నారు. కరోనా కళ్ల ద్వారా కూడా శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఇప్పుడు ఎక్కువగా ఉందని, కాబట్టి బయటకు వెళ్లే ప్రతీ ఒక్కరు కళ్లు మొత్తం కప్పి ఉంచేలా కళ్లజోళ్లు పెట్టుకోవాలని సూచిస్తున్నారు.
కరోనా వైరస్ అనేది వైరస్ ఉన్న వస్తువులను ముట్టుకోవడం, వైరస్ పడిన ఉపరితళాన్ని తాకడం వల్ల కంటే ఎక్కువగా వైరస్ ఉన్న రోగుల తుంపర్ల నుంచే ఎక్కువగా వ్యాపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని, మన జీవితంలో కొన్ని రోజుల పాటు కోవిడ్ నిబంధనలు భాగం కావాలని చెబుతున్నారు.
ఎట్టి పరిస్థితుల్లో జనాలు ఎక్కువ ఉన్న చోట్లకు వెళ్లవద్దని సూచిస్తున్నారు. అందరూ వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాలని చెబుతున్నారు. రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 14వ రోజు నుంచి ఆ వ్యాక్సిన్ కరోనా నుంచి మన శరీరానికి రక్షణ కల్పిస్తోందని చెబుతున్నారు. కాబట్టి, ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నా ఇంకో నెలన్నర తర్వాతనే దాని ఫలితం ఉంటుంది. అందుకే వ్యాక్సిన్ తీసుకోవడంలో నిర్లక్ష్యం వద్దంటున్నారు.