కరోనా వైరస్ ను అదుపు చేయడానికి ఎన్నో మార్గాలను అన్వేషిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పటికే కరోనాకు వాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చినా ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోతున్నారు. తాజాగా ఎయిమ్స్ శాస్త్రవేత్తలు ఓ వినూత్న ప్రయోగానికి తెరతీశారు. రుషికేశ్ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ – ఎయిమ్స్ శాస్త్రవేత్తలు గాయత్రీ మంత్రంతో కరోనాను అదుపుచేయవచ్చా? అనే విషయం పై పరిశోధనలు ప్రారంభించారు.
మంత్రాలతో కరోనా పోతుందా? అనే సందేహం మనకు కలగవచ్చు. అయితే వారు తెలిపిన వివరాల ప్రకారం.. గాయత్రీ మంత్రాన్ని పఠించడంతో పాటుగా సాధారణ చికిత్సను కూడా కరోనా రోగులకు అందించనున్నారు. అందుకోసం 20 మంది కరోనా రోగులపై పరిశోధనలు చేపట్టారు. ఇందులో భాగంగా పేషంట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. ఒక గ్రూపుకు సాధారణ చికిత్సతో పాటుగా ఉదయం సాయంత్రం వేళ ఒక గంటసేపు ప్రాణాయామం చేయించి వారితో గాయత్రి మంత్రం పఠనం చేయిస్తారు.
రెండో గ్రూప్ వారికి ప్రాణాయామం, మంత్ర పఠనం లాంటివి ఏమీ ఉండవు. కేవలం కరోనాకు ఇచ్చే సాధారణ చికిత్స ఇస్తారు. ఇలా చేయడం ద్వారా రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకునేవారికి కరోనా ఎన్ని రోజుల్లో నయమవుతుంది? చికిత్సతో పాటుగా ప్రాణాయామం, గాయత్రీ మంత్రం పాటించేవారికి ఎంత తక్కువ సమయంలో నయమవుతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నారు.
14 రోజుల తర్వాత రెండు గ్రూపుల మధ్య ఎవరి ఆరోగ్యం మెరుగుగా ఉందనే విషయాన్ని రికార్డు చేస్తారు. కేంద్ర ప్రభుత్వంలో భాగమైన డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (DST)వారు ఈ అధ్యయనాన్ని చేపట్టారు. ఇలాంటి ఒక పరిశోధన చేయడం ఇదే తొలిసారి కానుంది.