దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విరుచుకుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడిప్పుడే తెరుచుకున్న పాఠశాలల కొనసాగింపుపై సందిగ్దత నెలకొంది. మరో వైపు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు,ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల కొనసాగింపుపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలుస్తుంది.
రాష్ట్రంలో గత ఫిబ్రవరి 24 వ తేదీ నుంచి 6వ తరగతి నుంచి 8వతరగతి వరకు విద్యార్థులకు పాఠశాలలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు మాత్రం ఇప్పుడే తరగతుల ద్వారా బోధన అవసరం లేదని నిర్ణయించింది. ఇప్పుడు కరోనా కేసులు పెరుగుతుండటంతో మొదలు పెట్టిన తరగతులను కూడా నిలిపివేసే దిశగా ప్రభుత్వం ఆలోచనలో ఉంది. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశ సందర్భంగా ఈ విషయం సీఎం కేసీఆర్ దృష్టికి రావడంతో సీఎం ఈ అంశంపై స్పందించారు.
దీంతో మరో నాలుగు రోజుల్లో ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు రాష్ట్రవ్యాప్తంగా 6,7,8 వ తరగతి విద్యర్థులకు ఇంటి వద్దనే డిజిటల్ లేదా ఆన్ లైన్ తరగతులను బోధించే విధంగా మార్పులు చేయనున్నారు. మరోవైపు 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలు లేకుండానే పదవ తరగతికి ప్రమోట్ చేసే ఆలోచన కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది.
ఇక 10 వ తరగతి పరీక్షలకు టైం టేబుల్ ఖరారు కావడం, ఇప్పటికే విద్యార్థులు ఫీజులు కూడా చెల్లించడంతో వీరికి తరగతులను ఆపేస్తే బోర్డు పరీక్షలు ఇబ్బందిగా మారతాయని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయంతో మరోసారి 6,7,8 వ తరగతి విద్యార్థులు ఇళ్లకే పరిమితం కానున్నట్టు తెలుస్తుంది.