సిద్దిపేటలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు ప్రమాదంలో ముగ్గురు మరణించడంతో ఆ ప్రమాదాన్ని చూడటానికి వచ్చిన జనాలపై నుంచి అటుగా వస్తున్న డీసీఎం దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా సిఐ తో పాటుగా మొత్తం 15 మంది క్షతగాత్రులయ్యారు.
వివరాల్లోకి వెళితే .. హుజురాబాద్ కు చేందిన బయ్యారం నరేందర్ రెడ్డి తలిదండ్రులతో కలిసి ఆసుపత్రికి కారులో బయలుదేరాడు. అతని వాహనం సిద్ధిపేట శివార్లలోకి రాగానే డివైడర్ ను ఢీ కొట్టి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నరేందర్ రెడ్డితో పాటుగా అతని తల్లిదండ్రులు అక్కడికక్కడే మృతి చెందారు.
అయితే ఈ ప్రమాదాన్ని చూసేందుకు జనం పెద్ద ఎత్తున రోడ్డు పక్కన గుమిగూడారు. ప్రమాదాన్ని పరిశీలించడానికి సిద్ధిపేట టూ టౌన్ సిఐ తన సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. అదే సమయంలో కరీం నగర్ నుంచి వేగంగా వస్తున్న డీసీఎం వాహనం పక్కన ఉన్న కారును ఓవర్ టెక్ చేయబోయి అక్కడున్న ప్రజలపై నుంచి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో సిద్దిపేట జిల్లా రామునిపట్ల గ్రామానికి చెందిన అనరాశి మల్లేశం (40), మందపల్లి గ్రామానికి చెందిన వీరన్నపేట ఎల్లారెడ్డి (48)లు తీవ్ర గాయాలపాలయ్యారు. ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో వీరు మృతి చెందారు. కాగా ఈ ఘటనలో సిఐ తో పాటుగా మరో 15 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. వారందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడినవారిలో వారిలో గోపిరెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా వైద్యులు తెలిపారు.