తాను రాష్ట్ర స్థాయి నేత కావాలని కోరుకునే వాడినని, రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన పేజీ ఉండాలని కోరుకుంటానని టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఒక టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను విద్యార్థి దశలో ఏబీవీపీలో పని చేసిన విషయాన్ని ఆయన ధ్రువీకరించారు.
తాను చదువుకునే రోజుల్లో కేవలం ఏబీవీపీ, పీడీఎస్‌యూ, ఆర్ఎస్యూ విద్యార్థి సంఘాలు మాత్రమే ఉండేవని, అప్పటి పరిస్థితుల నేపథ్యంలో తాను ఏబీవీపీ ద్వారా విద్యార్థి రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన చెప్పారు. ఆ తర్వాత టీఆర్ఎస్ స్థాపించిన కొత్తలో మహబూబ్‌నగర్ జిల్లాలో ఆ పార్టీకి మద్దతు ఇవ్వమని కోరారని, అందుకే కొంతకాలం టీఆర్ఎస్కు సహకరించానని రేవంత్ స్పష్టం చేశారు.
అయితే, తాను మిడ్జిల్ జెడ్పీటీసీగా ఇండిపెండెంట్‌గా గెలిచాని, ఆ తర్వాత మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కూడా ఇండిపెండెంట్‌గానే గెలిచానని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో, కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తున్న సమయంలోనే తనను పార్టీలో చేర్చుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారని రేవంత్ రెడ్డి తెలిపారు. వైఎస్సార్ ఇప్పుడు లేరు కాబట్టి ఇంతకంటే ఎక్కువ చెప్పలేనని పేర్కొన్నారు.