logo

నిరుద్యోగుల‌కు భారీ శుభ‌వార్త‌.. రైల్వేలో 2,65,547 ఖాళీలు

దేశంలో నిరుద్యోగుల‌కు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ పార్ల‌మెంటు వేదిక‌గా ఒక మంచి శుభ‌వార్త చెప్పారు. రైల్వే శాఖ‌లో ఖాళీల‌కు సంబంధించి ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. దేశంలో రైల్వే శాఖ‌లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాటిని ఎప్పుడు భ‌ర్తీ చేస్తారు అనే సీపీఎంకు చెందిన ఎంపీ స‌దాశివ‌న్ ఒక ప్ర‌శ్న అడిగారు. ఈ ప్ర‌శ్న‌కు కేంద్ర‌మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ స‌మాధానం ఇచ్చారు.

దేశంలోని అన్ని రైల్వే జోన్ల‌లో క‌లిపి ప్ర‌స్తుతం 2,65,547 ఉద్యోగాలు ఖాళీగా ఉన్న‌ట్లు కేంద్ర‌మంత్రి ప్ర‌క‌టించారు. ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌డానికి ఆయా జోన్ల రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుల‌కు ఉత్త‌ర్వులు ఇస్తున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. కేంద్ర‌మంత్రి ప్ర‌క‌ట‌న ప్ర‌కారం దేశంలో త్వ‌ర‌లోనే భారీగా రైల్వే ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ ప్రారంభం కాబోతోంది.

దేశ‌వ్యాప్తంగా 2,177 గెజిటెడ్ ఉద్యోగాలు, 2,63,370 నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు రైల్వే శాఖ‌లో ఖాళీగా ఉన్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా ఖాళీలు ఉన్నాయి. సౌత్ సెంట్ర‌ల్ రైల్వే ప‌రిధిలోకి రెండు తెలుగు రాష్ట్రాలు వ‌స్తాయి. సౌత్ సెంట్ర‌ల్ రైల్వేలో మొత్తం 16,784 ఖాళీలు ఉన్న‌ట్లు కేంద్ర‌మంత్రి ప్ర‌క‌టించారు. ఇందులో 43 గెజిటెడ్ ఉద్యోగాలు కాగా, 16,741 నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

రైల్వే శాఖ‌లో త్వ‌ర‌లోనే నియామ‌కాల ప్ర‌క్రియ ప్రారంభం అయ్యే అవ‌కాశం ఉంది. ఇందులో ఎక్కువ‌గా నాన్ గెజిటెడ్ ఉద్యోగాలే ఖాళీగా ఉన్నాయి. అంటే, ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ విద్యార్హ‌త‌తోనే ఉద్యోగాలు పొందే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి, నిరుద్యోగులు, ప్ర‌భుత్వ ఉద్యోగం పొందాల‌నే ల‌క్ష్యంతో ఉన్న వారికి ఇది మంచి అవ‌కాశంగా ఉంటుంది. అయితే, ఎప్పుడు ఈ నియామ‌కాల ప్ర‌క్రియ ప్రారంభం అవుతుంద‌నేది మాత్రం కేంద్ర మంత్రి స్ప‌ష్టంగా చెప్ప‌లేదు.

Related News