ఎడమ చేతి వాటం అనేది మనం సాధారణంగా చూసే విషయం. మన స్నేహితులు, బంధువుల్లో ఎడమ చేతి వాటం ఉన్న వారు చాలామందే కనిపిస్తూ ఉంటారు. ఎడమ చేతితోనే రాయడం, కుడి చేతితో చేసే చాలా పనులను ఎడమ చేతితో చేయడం వీరికి అలవాటుగా ఉంటుంది. క్రికెట్, బ్యాట్మింటన్ వంటి క్రీడల్లోనూ ఎడమ చేతి వాటం కలిగిన క్రీడాకారులు చాలా మందే ఉంటారు. ఏదైనా పని చేయడంలో ఎడమ చేతి వాటం వారు కుడి చేతి వాటం వారికి ఏమాత్రం తీసిపోరు.
ఎడమ చేతి వాటం కలిగిన వారిని చూసినప్పుడల్లా మనకు సాధారణంగానే ఎందుకు కొందరికి ఇలా ఎడమ చేతి వాటం ఉంటుందనే అనుమానం కలుగుతుంది. జన్యువులు, పరిసరాల ప్రభావం కారణంగానే కొందరిలో ఎడమ చేతి వాటం వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతారు. అంతేకాదు, ఎడమ చేతి వాటానికి సంబంధించి ఇంకా అనేక ఆసక్తికర విషయాలు సైతం ఉన్నాయి.
స్త్రీలకన్నా పురుషుల్లోనే ఎడమ చేతి వాటం వారు ఎక్కువగా ఉంటారు. స్త్రీల కన్నా 50 శాతం పురుషుల్లో ఎడమ చేతి వాటం వారు ఎక్కువగా ఉంటాకట. ఎక్కువగా కవల పిల్లల్లో ఎడమ చేతి వాటం ఉంటుందని కూడా పలు పరిశోధనల్లో తేలింది. మామూలుగా జన్మించిన పిల్లల కంటే కవల పిల్లల్లో 17 శాతం ఎడమ చేతి వాటం ఎక్కువగా ఉంటుంది.
ఎడమ చేతి వాటం రావడంలో మెదడు కీలకమైనది. సాధారణంగా మన మెదడులోని కుడి అర్థభాగం మనం మాట్లాడే మాటలను నియంత్రిస్తుంది. ఎడమ చేతి వాటం వారిలో మాత్రం మెదడులోని ఎడమ అర్థభాగం వారి మాటలను నియంత్రిస్తుంది. ఎడమ చేతి వాటం రావడానికి ఇది కూడా ముఖ్య కారణంగా చెబుతారు. ఒకవేళ తల్లిదండ్రులు ఇద్దరు లేదా ఎవరో ఒకరికి ఎడమ చేతి వాటం ఉన్నా సరే పిల్లలకు ఎడమ చేతి వాటం వచ్చే అవకాశం ఉంటుంది.
26 శాతం ఎడమ చేతి వాటం కలిగిన వారిలో తల్లిదండ్రుల నుంచి వచ్చిన జన్యుపరమైన లక్షణాలే ఎడమ చేతి వాటానికి కారణం. ఎడమ చేతి వాటం కలిగిన వారికి ప్రతిభ ఎక్కువగా ఉంటుందని, ఏ పని అయినా బాగా చేయగలుగుతారని, అన్ని రంగాల్లోనూ రాణిస్తారని సైతం చాలామంది నమ్ముతుంటారు. అయితే, ఇటువంటి వాటికి మాత్రం శాస్త్రీయంగా ఎటువంటి ఆధారాలూ లేవు.