గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా కారణంగా అనారోగ్యం పాలై తుది శ్వాస విడిచారు. అయితే, ఆయనకు కరోనా సోకడానికి కారణం ఓ ప్రముఖ తెలుగు టీవీ ఛానల్లో జరిగిన ఓ కార్యక్రమమే అని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్లే ఆయన కరోనా బారిన పడ్డారని చెబుతున్నారు. కరోనా వైరస్ ప్రభావం వృద్ధులపై ఎక్కువగా ఉంటుందని వైద్యులు పదేపదే చెబుతున్నారు. 60 ఏళ్లకు పైబడిన వారు అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుంచి బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు.
74 ఏళ్లు ఎస్పీ బాలు ఈ సూచనలు పాటించారు. కరోనా వైరస్ ప్రభావం మొదలైన తర్వాత ఆయన పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. చెన్నైలోని కమదార్నగర్లోని తన ఇంట్లోనే గడిపారు. అయినా కూడా సోషల్ మీడియా ద్వారా పాటలు పాడుతూ తన అభిమానులను అలరించేందుకు ప్రయత్నించారు. కరోనా వైరస్పైన కూడా ఆయన పాట పాడారు. కరోనా జాగ్రత్తల్లో భాగంగా ఇంట్లోనే ఉంటున్న బాలసుబ్రహ్మణ్యం ఓ తెలుగు ఛానల్ నిర్వహించే కార్యక్రమానికి వెళ్లాల్సి వచ్చింది.
ఆ ఛానల్లో ఎస్పీ బాలు చాలా రోజులుగా పలు కార్యక్రమాలు, షోలకు హాజరయ్యేవారు. కరోనా మొదలయ్యాక కూడా ఆ ఛానల్ ఒక కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా బాలసుబ్రహ్మణ్యంను ఆహ్వానించారు ఆ ఛానల్ నిర్వహకులు. అయితే, కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నందున తాను రాలేనని ఆయన చెప్పారని తెలుస్తోంది. కరోనా ప్రభావం, లాక్డౌన్ వల్ల మీ ఆహ్వానాన్ని మన్నించలేకపోతున్నాను.. ఏమీ అనుకోకండి అని కూడా ఆయన తేల్చి చెప్పారట.
అయినా కూడా సదరు టీవీ ఛానల్ వారు బాలును బతిమిలాడి ఒప్పించారు. దీంతో బాలసుబ్రహ్మణ్యం ఆయన భార్య సావిత్రి, కుమారుడు చరణ్, వ్యక్తిగత కార్యదర్శిని వెంటబెట్టుకొని చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చారు. అక్కడే ఆయన ప్రమాదంలో పడ్డారు. ఆ టీవీ ఛానల్ కార్యక్రమం నిర్వహించిన బృందంలో 20 మందికిపైగా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయం అప్పటికి తెలియదు. మూడు రోజుల పాటు ఈ బృందంతో కలిసి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పని చేశారు.
తర్వాత చెన్నై వెళ్లిన తర్వాత ఆయన స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ముందుజాగ్రత్తగా ఆయన ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటీవ్ అని తేలింది. ఆయనతో పాటు ఆయన భార్యకు పరీక్షించగా ఆమెకు కూడా వైరస్ సోకింది. ఆ తర్వాత ఎస్పీ బాలు హైదరాబాద్ టీవీ షోలో పాల్గొన్న బృందంలో 20 మందికి కరోనా పాజిటీవ్ వచ్చినట్లు తేలింది. అంటే ఈ బృందంలోనే వైరస్ వ్యాప్తి చెందినట్లు స్పష్టమవుతోంది.
ఆగస్టు 5వ తేదీన ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం తనకు కరోనా వైరస్ సోకినట్లు అభిమానులకు చెప్పారు. చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలో ఆయన అరోగ్యం విషమించింది. దీంతో ఆగస్టు 13న ఐసీయూలోకి తరలించి వెంటిలేటర్ పెట్టారు. ఎస్పీబీని కాపాడేందుకు వైద్యులు శతవిధాలా ప్రయత్నించారు. కానీ వైద్యుల ప్రయత్నాలు, అభిమానుల పూజలు ఫలించలేదు. ఆయన సెప్టెంబర్ 25న తుదిశ్వాస విడిచారు.