logo

  BREAKING NEWS

ఇండోనేషియా నోటుపై వినాయ‌కుడు ఉంటాడా..? ఇదీ అస‌లు నిజం

హిందువులు మెజారిటీగా ఉండే దేశాల్లో కూడా క‌రెన్సీ నోటుపై హిందూ దేవుళ్ల చిత్రాలు లేవు. కానీ ఒక ముస్లిం దేశంలో హిందూ దేవుడి చిత్రాన్ని క‌రెన్సీ నోటుపై ముద్రించ‌డం మ‌న‌ల్ని చాలా ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. ముస్లింలు మెజారిటీగా ఉండే ఇండోనేషియాలో 20 వేల రూపాయ‌ల క‌రెన్సీ నోటుపై హిందువుల ఆరాధ్య దైవం వినాయ‌కుడి చిత్రం ఉంటుంద‌ని మ‌న‌లో చాలా మందికి తెలుసు. అయితే, ఇదొక్క‌టే కాదు.. ఇండోనేషియా గురించి మ‌రికొన్ని విష‌యాలు కూడా మ‌న‌ల్ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఇండోనేషియా ఆసియాలోని ఓ ద్వీప దేశం. ప్ర‌పంచంలో ఎక్కువ మంది జ‌నాభా క‌లిగిన ద్వీప దేశం ఇది. ముస్లిం ప్ర‌జ‌లు మెజారిటీగా ఉంటారు. కానీ, ప‌ర‌మ‌త స‌హ‌నానికి ఇండోనేషియా పెద్ద పీట వేస్తుంది. ఆ దేశ ప్ర‌భుత్వం అధికారికంగా ఆరు మ‌తాల‌ను గుర్తించింది. ఇస్లాంతో హిందుత్వం, బుద్ధిజం, కాథ‌లిజం, వంటి ఆరు మ‌తాల ప్ర‌జ‌ల ఇండోనేషియాలో జీవిస్తారు. అయితే, దేశంలోని 87 శాతం మంది జ‌నాభా మాత్రం ముస్లింలే. అందుకే ప్ర‌పంచంలో ఎక్కువ మంది ముస్లింలు నివ‌సించే దేశంగా ఇండోనేషియా ఉంది.

ఇండోనేషియాలో హిందువు‌ల సంఖ్య చాలా త‌క్కువ‌. దేశ జ‌నాభాలో కేవ‌లం 1.7 శాతం జ‌నాభా మాత్ర‌మే హిందువులు. కానీ, హిందుత్వానికి ఇండోనేషియాలో చాలా ప్రాధాన్య‌త ఉంటుంది. మ‌తాల‌తో సంబంధం లేకుండా ఇండోనేషియా ప్ర‌జ‌లు హిందూ దేవుళ్ల‌ను గౌర‌విస్తారు, ఆరాధిస్తారు. ఇండోనేషియాలో ఒకప్పుడు హిందుత్వమే ఉండేది. చోళులు ఈ దేశాన్ని ప‌రిపాలించార‌ని చ‌రిత్ర చెబుతోంది. 1వ శ‌తాబ్ధం నుంచి ఇక్క‌డ హిందుత్వం ఉంది.

చోళుల కాలంలో ఇండోనేషియాలో అనేక హిందూ ఆల‌యాలు నిర్మిత‌మ‌య్యాయి. వీటిలో చాలా ఆల‌యాలు ఇప్ప‌టికీ చెక్కు చెద‌ర‌కుండా ఉన్నాయి. ఈ పురాత‌న ఆల‌యాలు ఇప్ప‌టికీ నిత్య పూజ‌లు అందుకుంటూ క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. ప‌ర్యాట‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నాయి. ఇక‌, ఇండోనేషియా క‌రెన్సీ నోటుపై వినాయ‌కుడి చిత్రం ముద్ర‌ణ వెనుక కూడా పెద్ద క‌థ‌నే ఉంది. వినాయ‌కుడిని ఇండోనేషియా ప్ర‌జ‌లు బుద్ధ‌బ‌లానికి, మంచికి ప్ర‌తీక‌గా భావిస్తారు.

ఆ దేశంలో అనేక వినాయ‌కుడి విగ్ర‌హాలు, ఆల‌యాలు ఎన్నో శ‌తాబ్ధాలుగా ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం ఇండోనేషియా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, ఆ దేశ క‌రెన్సీకి విలువ దారుణంగా ప‌డిపోయింది. ఈ స‌మ‌యంలో కొత్త‌గా 20 వేల రూపాయ‌ల నోటు ముద్రించాల‌ని ఆ దేశ ప్ర‌భుత్వం భావించింది. అప్పుడు కొత్త నోటుపై మంచికి ప్ర‌తీక‌గా భావించే వినాయ‌కుడి చిత్రాన్ని ముద్రిస్తే బాగుంటుంద‌ని ఓ మంత్రి సూచించార‌ట‌. దీంతో 20 వేల నోటుపై ఒక‌వైపు వినాయ‌కుడి విగ్ర‌హంతో పాటు ఆ దేశ స్వ‌తంత్య్ర స‌మ‌ర‌యోధుడు కి హ‌జ‌ర్ దెవంత‌ర చిత్రాల‌ను, నోటుకు మ‌రోవైపు త‌ర‌గ‌తి గ‌ది చిత్రాల‌ను ముద్రించ‌డం ప్రారంభించారు.

1998 నుంచి ఇండోనేషియాలో కొత్త నోట్లు ముద్రిస్తున్నారు. అప్ప‌టినుంచి ముద్రించే నోట్ల‌పై వినాయ‌క చిత్రం ఉండ‌దు. అంటే, పాత నోట్ల‌పైన ఈ చిత్రాన్ని చూడొచ్చు. అయితే, ప్ర‌స్తుతం 20 వేల నోటుపై వినాయ‌క చిత్రం లేక‌పోయినా మ‌రో విశేషం ఉంది. 50 వేల నోటుపై బాలిలోని ప్ర‌ముఖ హిందూ ఆల‌యం చిత్రాన్ని ఇప్ప‌టికీ ముద్రిస్తున్నారు. ప్ర‌పంచంలోని ప్ర‌ముఖ టూరిస్ట్ స్పాట్ల‌లో బాలి ఒక‌టి. బాలిలోని పురాత‌న హిందూ ఆల‌యం అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. బాలిలో ఎక్కువ‌గా హిందువులు నివసిస్తుంటారు.

ఇండోనేషియా హిందుత్వాన్ని గౌర‌విస్తుంద‌న‌డానికి మ‌రికొన్ని ఉదాహ‌ర‌ణ‌లు కూడా ఉన్నాయి. ఈ దేశం మ‌హాభార‌తం, రామాయ‌ణాన్ని బాగా విశ్వ‌సిస్తుంది. అందుకే ఇండోనేషియా రాజ‌ధాని జ‌క‌ర్తాలోని ప్ర‌ముఖ కూడ‌లిలో కృష్ణార్జునుల భారీ విగ్ర‌హం ఉంటుంది. అంతేకాదు, ఇండోనేషియా మిలిట‌రీ అధికారిక చిహ్నంగా హ‌నుమంతుడి చిత్రం ఉంటుంది. ఇండోనేషియా మొద‌టి అధ్య‌క్షుడు సుక‌ర్ణో పేరు మ‌హాభార‌తంలోని క‌ర్ణుడి పేరు ఆధారంగా పెట్టార‌ట‌. ఆయ‌న త‌ర్వాత అధ్య‌క్షురాలైన ఆయ‌న కూతురి పేరు సంస్కృత హిందూ పేరైన మేఘావ‌తిగా పెట్టుకున్నారు. ఇలా ఇండోనేషియా ముస్లిం దేశ‌మే అయినా హిందుత్వానికి కూడా విశేష ప్రాధాన్య‌త ఉంటుంది.

Related News