ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఒక కీలక ప్రసంగం చేశారు. ఇథనాల్ రోడ్‌మ్యాప్ 2020 – 25 అనే ఒక లక్ష్యాన్ని ప్రధాని ఆవిష్కరించారు. 2025 నాటి కల్లా పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడమే లక్ష్యంగా పెట్టుకొని తమ ప్రభుత్వం పని చేస్తున్నట్లు మోడీ ప్రకటించారు. ఇథనాల్ అంటే ఏమిటి ? అసలు పెట్రోల్‌లో ఇథనాల్ ఎందుకు కలుపుతారు ? ఇలా కలిపితే వచ్చే లాభాలేంటి ? అసలు ఇథనాల్ ఎలా వస్తుంది అనే అంశాలు మనలో చాలా మందికి తెలియవు. ఇవి ఈ వీడియోలు తెలుసుకుందాం.
ఇథనాల్ అంటే బయో ఇంధనం. చెరుకు నుంచి ఎక్కువగా ఇథనాల్ తయారుచేస్తారు. పాడైపోయిన గోధుమలు, నూకలు, వ్యవసాయ వ్యర్థాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇథనాల్‌ను ఉత్పత్తి చేయవచ్చు. ఇది పూర్తిగా పర్యావరణానికి మేలు చేసేది. ఇంచుమించు పెట్రోల్‌లో ఉండే గుణాలే ఇథనాల్లోనూ ఉంటాయి. కాబట్టి, పెట్రోల్‌లో ఇథనాల్ కలుపుతారు. ఇప్పటికే మన దేశంలో ఈ ప్రక్రియ ప్రారంభమైంది.
2014లో పెట్రోల్‌లో సుమారు ఒక శాతం ఇథనాల్ కలిపేవారు. ప్రస్తుతం 8.5 శాతం ఇథనాల్ కలుపుతున్నారు. పెట్రోల్‌లో ఇథనాల్ కలిపే శాతాన్ని పెంచడం వల్ల మన దేశానికి, మనకు చాలానే లాభాలు ఉన్నాయి. ఇథనాల్ వల్ల పర్యావరణానికి ఎటువంటి హానీ ఉండదు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది. వ్యవసాయ వ్యర్థాల నుంచి ఇథనాల్‌ను తయారుచేస్తారు కాబట్టి రైతులకు ఇది చాలా మేలు చేస్తుంది.
రైతులు వ్యవసాయ వ్యర్థాలను ఇప్పుడు వృథా చేస్తున్నారు. ఇథనాల్ వాడకం పెరిగితే ఉత్పత్తి పెరుగుతుంది. అప్పుడు రైతుల వ్యవసాయ వృర్థాల వల్ల కూడా లాభం పొందే అవకాశం కలుగుతుంది. పెట్రోల్‌లో ఇథనాల్ కలిపే శాతం పెరిగితే దేశానికి చాలా లాభం. ప్రస్తుతం మనం ముడి చమురు గల్ఫ్, సెంట్రల్ ఏషియా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ప్రపంచంలో అత్యధికంగా చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది.
మన దేశంలో వినియోగించే 85 శాతం చమురు విదేశాల నుంచి దిగుమతి చేసుకునేది. దిగుమతుల వల్ల ధరలు ఎక్కువగా ఉండి ప్రజలపై ఎక్కువ భారం పడుతుంది. పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం పెరిగితే చమురు దిగుమతి తగ్గే అవకాశం ఉంటుంది. ముడిచమురు కోసం ఇతర దేశాలపై మన దేశం ఆధారపడటమూ తగ్గుతుంది. తద్వారా పెట్రోల్ ధర కూడా తగ్గే అవకాశాలూ ఉన్నాయి. పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం అన్నిరకాలుగా ప్రయోజనకరం కాబట్టి కేంద్రం ఈ విషయంపై దృష్టి పెట్టింది.
వాస్తవానికి 2030 నాటి కల్లా పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలని మొదట కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పుడు మరింత వేగంగా ఈ పని చేయాలని, 2025 నాటికే ఈ లక్ష్యాన్ని అందుకోవాలని పట్టుదలగా ఉంది. వచ్చే సంవత్సరం కల్లా 10 శాతం కలపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసమే ఇథనాల్ రోడ్ మ్యాప్ 2020 – 25 అనేది రూపొందించారు. ఒకవేళ కేంద్రం కనుక ఈ లక్ష్యాన్ని అందుకుంటే ప్రజలకు, రైతులకు, దేశానికి, పర్యావరణానికి చాలా మేలు జరుగుతుంది.