జూనియర్ ఎన్టీఆర్ దగ్గర హీరో రామ్ చరణ్ ఏకంగా రూ.25 లక్షలు గెలుచుకున్నాడట. సినిమాల్లో రెమ్యూనరేషన్లతో కోట్లు సంపాదించే రామ్ చరణ్‌కు గేమ్ షోలో కూడా జాక్‌పాట్ తగిలిందని తెలుస్తోంది. మిత్రుడి షోకి గెస్టుగా వచ్చి పాతిక లక్షలు పోగేసుకొని వెళ్లాడట. అసలు విషయం ఏంటంటే.. కౌన్ బనేగా కరోడ్‌పతి ఇన్స్పిరేషన్తో తెలుగులో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో వచ్చిన సంగతి తెలిసిందే.
స్టార్ మాలో నాలుగు సీజన్లు ఈ షో నడిచింది. మొదటి మూడు సీజన్లను అక్కినేని నాగార్జున హోస్ట్‌గా నడిపించారు. చివరి సీజన్‌ను మెగాస్టార్ చిరంజీవి నడిపించారు. ఆ తర్వాత స్టార్ మా ఛానల్లో ఈ షో ఆగిపోయింది. ఈ షోకి మంచి క్రేజ్, వ్యూయర్షిప్ ఉండటంతో జెమినీ టీవీ వాళ్లు కంటిన్యూ చేయాలని నిర్ణయించుకున్నారు. సరికొత్త హంగులు అద్ది ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే పేరుతో కొత్తగా షో ప్రారంభిస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ఈ షోకి హోస్ట్‌గా ఉన్నాడు. చాలా రోజుల క్రితమే ఈ షోకి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. ఇప్పటికే ఇది ప్రారంభం కూడా కావాల్సి ఉంది. కానీ, కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యమైంది. ఆగస్టు 16 నుంచి ఈ షో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని ఎపిసోడ్స్ షూటింగ్ కూడా అయిపోయిందట.
గ్రాండ్ ఓపెనింగ్‌లో భాగంగా మొదటి ఎపిసోడ్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్‌గా రానున్నాడట. ఈ ఎపిసోడ్లో ఎన్టీఆర్ ప్రశ్నలకు టపీటపీమని సమాధానాలు చెప్పిన రామ్ చరణ్ ఏకంగా రూ.25 లక్షలు గెలుచుకున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పుడు వీరి కాంబోలో ఎవరు మీలో కోటీశ్వరులు ప్రారంభం అవుతుండటంతో షోపైన కూడా బాగా క్రేజ్ మొదలైంది.