హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ మధ్య తరచూ సోషల్ మీడియా వార్తలు, పుకార్లలో ఉంటోంది. కొందరు ఆమెపైన రకరకాల పుకార్లను పుట్టిస్తూ పోస్టులు చేస్తున్నారు. ఇవి ఒక్కోసారి దిగజారి ఉంటున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్‌కు ఒక నాయకుడు ఇల్లు కొనిచ్చాడని ఈ మధ్య పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. తమ రాజకీయాల్లోకి ఆమెను లాగి మహిళ అని కూడా చూడకుండా దారుణంగా పుకార్లు సృష్టిస్తున్నారు. అయితే, ఇప్పటివరకు రకుల్ ప్రీత్ సింగ్ ఇటువంటి ప్రచారాలపై స్పందించలేదు.
తాజాగా ఆమె ఈ ప్రచారాలపై కాస్త సీరియస్‌గానే రియాక్ట్ అయ్యారు. తనకు హైదరాబాద్‌లో ఎవరో ఇల్లు కొనిచ్చారని ప్రచారం చేస్తున్నారని, ఇలా ఎవరో గిఫ్ట్ ఇస్తే తాను ఇంత కష్టపడి ఎందుకు పని చేయాలని ఆమె ప్రశ్నించారు. ఆహా ఓటీటీలో అక్కినేని సమంత హోస్ట్‌గా సామ్ జామ్ అనే ఒక షో వస్తోంది. ఈ షోలో సెలబ్రిటీలను సమంత ఇంటర్వ్యూ చేస్తోంది. తాజాగా షోకి హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి వచ్చారు.
”నీపైన చాలా రూమర్స్ వినిపిస్తుంటాయి.. నువ్వు మాత్రం వాటికి అస్సలు స్పందించకుండా నీ పని నీవు చేసుకుంటూ ఉంటావు.. అదలా సాధ్యమవుతుంది.. నేనైతే అలా అస్సలు ఉండలేను” అని రకుల్ ప్రీత్ సింగ్‌ను సమంత ప్రశ్నించింది. దీనికి స్పందించిన రకుల్.. ”నిజమే… నాపై చాలా రూమర్స్ వస్తున్నాయి. రూమర్స్ అని ముందే తెలిసినప్పుడు ఇక వాటిపై స్పందించడం దేనికి అని అనుకుంటా. అందుకే వాటిని అస్సలు పట్టించుకోను.”
”హైదరాబాద్‌లో నాకు ఎవరో ఒకతను ఇల్లు కొనిచ్చారనే ప్రచారం చేస్తున్నారు. నిజంగా నాకు ఎవరో ఇల్లు కొనిచ్చేటట్లు అయితే ఇక నేనేందుకు ఇంత కష్టపడి పని చేయాలి ? ఇలాంటి రూమర్స్ పుట్టించే వారు మన గురించి అస్సలు పట్టించుకోరు. ఇష్టం వచ్చినట్లు రాసేస్తారు. అందుకే వాటిపైన అస్సలు స్పందించను” అని రకుల్ ప్రీత్ సింగ్ కొంచెం బాధపడుతూనే సమాధానం ఇచ్చింది.
సెలబ్రిటీలు, సినీ నటులపై పుకార్లు రావడం ఎక్కువగా జరిగేది. రకుల్ ప్రీత్ సింగ్‌పైన అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో శృతిమించి ప్రచారాలు చేస్తున్నారు. కొందరు రాజకీయ పార్టీల శ్రేణులు కూడా రకుల్ ప్రీత్‌పై పుకార్లు పుట్టిస్తున్నారు. ఇటువంటి వాటికి రకుల్ ఈ షోతో గట్టి సమాధానమే ఇచ్చినట్లయ్యింది. ఈ షో ప్రస్తుతం ఆహా ఓటీటీ యాప్‌లో ఉంది.