రెబల్ స్టార్ అభిమానులకు రాధే శ్యామ్ టీమ్ మరో సర్ప్రైజ్ ను అందించింది. ఫిబ్రవరి 14 డే సందర్భంగా ‘రాధే శ్యామ్’ నుంచి సరికొత్త గ్లింప్స్ ను విడుదల చేయనున్నట్టుగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ప్రభాస్ కొత్త పోస్టర్ ను విడుదల చేయగా అది క్షణాల్లో వైరల్ గా మారింది. వింటేజ్ స్టైల్ లో ఉన్న ఈ ఫొటోలో ప్రభాస్ ఓ పాత భవనం ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా ఉంది.
ఇందులో ప్రభాస్ ధరించిన కాస్ట్యూమ్స్, లుక్ మరింత ఆకట్టుకుంటున్నాయి. ఈ పోస్టర్ లో ఫిబ్రవరి 14 న విడుదల చేయబోయే గ్లింప్స్ ను కూడా ప్రకటించారు. ప్రేమికుల రోజు సందర్భంగా ఉదయం 9:18 నిమిషాలకు దేనిని విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. దీంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కాగా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. వింటేజ్ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజ హేగ్దే కథానాయికగా కనిపించనుంది. కాగా ఈ సినిమాకు ‘గీత గోవిందం’ ఫెమ్ జస్టిన్ ప్రభాకర్ సంగీతం అందించారు. కృష్ణంరాజు నిర్మాణంలో ప్రభాస్ స్నేహితులైన వంశీ, ప్రమోద్ లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీపై ఇంకా క్లారిటీ రావలసి ఉంది.