దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉన్న టీవీ షోలలో అమితాబ్ బచ్చన్ నిర్వహించే కౌన్ బనేగా కరోడ్‌పతి ఒకటి. అన్ని ప్రాంతాల్లో ఈ షోకు వ్యూయర్స్ ఉన్నారు. సామాన్యులు, సెలబ్రిటీలు అంతా ఈ షోలో పాల్గంటూ ఉంటారు. ఇందులో ప్రశ్నలు కూడా అన్ని ప్రాంతాలకు సంబంధించినవి ఉంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన షోలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీకి సంబంధించి ప్రశ్న వేశారు అమితాబ్ బచ్చన్.
25 లక్షల ప్రశ్నగా అమితాబ్ బచ్చన్ అడగగా పోటీకి వచ్చిన కంటెస్టెంట్ సమాధానం చెప్పలేక వదులుకొని క్విట్ అయ్యాడు. కాస్త వివరాల్లోకెళ్తే… ఉత్తరప్రదేశ్‌లోని బలియాకు చెందిన ఓ సాధారణ ప్రైవేటు ఉద్యోగి సోను కుమార్ గుప్తా కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్ 12లో అడుగుపెట్టాడు. చాలా పోటీ నడుమ హాట్ చైర్లో కూర్చున్నాడు. అమితాబ్ బచ్చన్ అడిగిన 12 ప్రశ్నలకు సోనూ సరైన సమాధానాలు ఇచ్చాడు. దీంతో అప్పటికే 12.5 లక్షలు గెలుచుకున్నాడు సోను.
13వ ప్రశ్నగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రశ్నను అడిగారు అమితాబ్. 2019లో పి.సుభాష్ చంద్రబోస్ అనే రాజకీయ నాయకుడు ఏ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు అని అమితాబ్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు గానూ ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, కర్ణాటక అని నాలుగు ఆప్షన్లు కూడా ఇచ్చారు. ఈ సమాధానం సోనుకు తెలియదు. కానీ, ఆంధ్రప్రదేశ్ కావొచ్చు అని అనుకున్నాడు. అప్పటికే ఆయనకు ఉన్న లైఫ్లైన్లు అయిపోయాయి.
దీంతో రిస్క్ తీసుకోకుండా క్విట్ కావాలి అనుకున్నాడు. ఈ ప్రశ్నకు సమాధానం చేప్పకుండా క్విట్ అన్నాడు. దీంతో సోను కుమార్ గుప్తా 12.5 లక్షలు గెలుచుకున్నాడు. క్విట్ చేశాక ఈ క్వశ్చన్‌కు సమాధానం ఏంటని అనుకున్నావు అని అమితాబ్ ప్రశ్నించగా ఆంధ్రప్రదేశ్ అని అనుకున్నానని చెప్పాడు. కానీ, నమ్మకంగా సమాధానం తెలియకపోవడంతో క్విట్ చేశాడు సోనూ. ఒకవేళ తాను అనుకున్నట్లుగా ఆన్సర్ చెప్పి ఉంటే సోనూ 25 లక్షలు గెలుచుకునేవాడు.
ఈ సందర్భంగా వైఎస్ జగన్, వైసీపీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ గురించి అమితాబ్ కొన్ని వివరాలు షో వేదికగా చెప్పారు. వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2019లో ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిందని, జగన్ ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. ఐదుగురికి డిప్యూటీ సీఎంలుగా అవకాశమివ్వగా వారిలో ఒకరు పిల్లి సుభాష్ చంద్రబోస్ అని చెప్పారు. గతంలో పీవీ సింధూ ఈ షోకు వచ్చినప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి పేరును అమితాబ్ అడగగా ఆమె సరైన సమాధానం చెప్పారు.