logo

  BREAKING NEWS

ప్రపంచాన్ని వణికిస్తున్న ‘బుబోనిక్ ప్లేగు’.. ఇది కరోనా కన్నా డేంజర్!  |   గాల్వన్ లోయ నుంచి చైనా వెనక్కి.. డ్రాగన్ ను నమ్మలేమంటున్న భారత్  |   చైనాతో యుద్ధం.. భారత్ కు మద్దతుగా నిలుస్తున్న దేశాలు ఇవే!  |   హైదరాబాద్ లో మళ్ళీ లాక్ డౌన్ లేనట్టే.. కారణం ఇదే!  |   బ్రేకింగ్‌: తెలంగాణ‌లో ఇవాళ భారీగా న‌మోదైన క‌రోనా కేసులు  |   బ్రేకింగ్‌: రైతుల కోసం జ‌గ‌న్ మ‌రో అద్భుత‌మైన ప‌థ‌కం  |   సోష‌ల్ మీడియాలో క‌నిపించే ఈ ఆఫ్రిక‌న్ బుడ్డోడి అస‌లు క‌థ ఇది  |   కరోనా రికార్డు.. 24 గంటల్లో 20,903 కేసులు.. 18 వేల మరణాలు!  |   లఢక్ కు చేరుకున్న ప్రధాని మోడీ.. దేనికి సంకేతం?  |   తెలంగాణలో లాక్ డౌన్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ..!  |  

అపర చాణక్యుడు, తెలంగాణ ఠీవి మన పీవీ నరసింహారావుకు ‘వంద’నం

దేశం నాకేమిచ్చిందన్నది కాదు దేశానికి నేనేమి ఇచ్చానన్నదే ముఖ్యం అని నమ్మిన వ్యక్తి రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో చేతల్లో చూపారు మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు. రాజకీయాలకే రాజనీతి నేర్పిన అపర చాణక్యుడు ఆయన. దేశం గర్వించిన తెలంగాణ బిడ్డ. పీవీ పేరు చెబితే ముందుగా మనకు గుర్తుకు వచ్చేవి ఆర్థిక సంస్కరణలే. అప్పటి వరకు దేశం అనుసరిస్తున్న ప్రభుత్వ – ప్రైవేటు విధానాలకు బ్రేకులు వేసి ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ఒక్క కుదుపుతో ముందుకు తీసుకెళ్లారు. ఇవాళ అనేక రంగాల్లో మనం అభివృద్ది లో దూసుకుపోతున్నామంటే అదంతా పీవీ ప్రభుత్వం అమలు చేసిన ఆర్థిక సంస్కరణల ఫలితమే. దేశానికి విశిష్ట సేవలను అందించిన పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ఆయన సేవలను మరొక్కసారి గుర్తు చేసుకుందాం..

కాలేజీ నుంచి బహిష్కరణ..
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి లో 1921 జూన్ 28న పీవీ జన్మించారు. పదేళ్ల వయసులోనే ఆయనకు సత్యమ్మతో వివాహం జరిగింది. వరంగల్ లో ప్రాథమిక విద్యను, హన్మకొండ గవర్నమెంట్ స్కూల్లో మెట్రిక్యులేషన్ ను పూర్తి చేసారు. ఇంటర్ మీడియేట్ చదవడానికి పీవీ హైద్రాబాదులో అడుగుపెట్టారు. వందేమాతరం ఉద్యమం ఉవ్వెత్తున ఎగుస్తున్న కాలమది. 1938లో ఉస్మానియా యూనివర్సిటీలో వందేమాతరం గీతం ఆలపించడం నిషేధం. ఆ రోజుల్లోనే 300 మందితో కలిసి యూనివర్సిటీలో వందేమాతరాన్ని ఆలపించారు. దీంతో ఆయన యూనివర్సిటీ నుంచి బహిష్కరింపబడ్డారు. తర్వాత నాగ్ పూర్ వెళ్లి ఇంటర్ విద్యను పూర్తి చేసారు. ఓ వైపు స్వాతంత్రోద్యమంలో పాల్గొంటూనే ఇంటర్ ఫస్ట్ క్లాస్ లో పాసయ్యారు. పూణె ఫెర్గూసన్ కాలేజీలో బీఎస్సీ, నాగ్ పూర్ యూనివర్సిటీలో న్యాయవిద్య పూర్తిచేసి హైదరాబాద్ తిరిగివచ్చారు. మాజీ మంత్రి బూర్గుల రామకృష్ణారావు వద్ద జూనియర్ లాయర్ గా చేరారు.

ముఖ్యంమత్రి పదవికి రాజీనామా..
ఆ సమయంలోనే కాంగ్రెస్ లో చేరి రాజకీయాల వైపు అడుగులు వేశారు. పీవీ రాజకీయ జీవితం ఓటమితోనే మొదలైంది. మొదటి సారి కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 1957 నుంచి వరుసగా నాలుగు సార్లు మంథని ఎమ్మెల్యేగా గెలిచారు. 1971లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్య మంత్రి పీఠం అధిష్టించగానే అప్పటివరకు గ్రామాల్లో ఉండే పెత్తందారీ వ్యవస్థను సరిచేయాలనుకున్నారు. భారీ ఎత్తున కఠినమైన భూసంస్కరణలు అమలు చేశారు. అందుకోసం తన వద్ద ఉన్న 1200 ఎకరాల భూమిని కూడా వదులుకుని మార్గదర్శకంగా నిలిచారు. దీని వల్ల భూస్వాముల ఆగ్రహానికి గురయ్యారు. వారి ద్వారా కొందరు నేతలు హై కమాండ్ పైన తెచ్చిన ఒత్తిడి కారణంగానే 1973లో పీవీ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

విద్యా విధానంలో సంస్కరణలు..  
ముఖ్యమంత్రిగా పని చేయడానికి ముందే పీవీ ఎన్నో శాఖల్లో బాధ్యతలు నిర్వర్తించారు. అయితే అవన్నీ అంతగా ప్రాధాన్యం లేనివే కావడం విశేషం. అయినా ప్రతి శాఖలోనూ తన మార్కు ను చూపించారు. పీవీ జైళ్ల శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే జైళ్లలో లైబ్రరీలను మొదటిసారిగా ప్రవేశ పెట్టారు. ఖైదీలలో మార్పు తేవడానికి అయన ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఆ తర్వాత 1967 లో విద్యాశాఖ మంత్రిగా పనిచేసారు. తెలుగును అధికార భాషగా గుర్తించడానికి పునాదులు వేసిన ఘనత కూడా ఆయనదే. ఆనాటి నుండే ప్రాథమిక విద్య నుండి డిగ్రీ వరకు తెలుగును బోధనా భాషగా ప్రవేశపెట్టారు. ఏడవ తరగతి వరకు విద్యార్థులు ఉత్తీర్ణతతో సంబంధం లేకుండా పై తరగతులకు వెళ్లే విధానాన్ని తెచ్చింది కూడా పీవీనే.

రాజీవ్ గాంధీ హత్యతో ప్రధాని బాధ్యతలు…
రాజీవ్ గాంధీ క్యాబినెట్ లో మానవ వనరుల మంత్రిగా ఉన్న సమయంలోనే ఎన్నో సంస్కరణలు తెచ్చారు. ఇప్పుడున్న నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు కూడా పీవీ ఆలోచనల్లోంచి పుట్టినవే. రెండు సార్లు విదేశాంగమంత్రిగా పనిచేసి పొరుగు దేశాలతో సత్సంబంధాలు ఏర్పరుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. 1991లో రాజకీయ సన్యాసం తీసుకుని హైదరాబాద్ లో స్థిరపడాలని ఆయన అనుకున్నారట. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పీవీ ప్రధాని బాధ్యతలు చేపట్టవలసి వచ్చింది. రాజీవ్ గాంధీ హత్యకు గురి కావడంతో కాంగ్రెస్ పార్టీకి నాయకుడి అవసరం ఏర్పడింది. వివాదరహితుడు, కేంద్ర మంత్రిగా ఎన్నో శాఖల్లో పనిచేసిన అనుభవం ఉన్నవాడు, అపర మేధావి అయిన పీవీ ప్రధాన మంత్రి అయ్యారు. నంద్యాల నియోజక వర్గం నుంచి గెలిచి లోక్ సభలో అడుగు పెట్టారు. దక్షణాది నుంచి ప్రధాని అయిన తోలి తెలుగు వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

ఏకైక తొలి తెలుగు ప్రధాని, అపర చాణక్యుడు..
అంతేకాదు నెహ్రు కుటుంబం నుంచి కాకుండా ఒక బయటి వ్యక్తి ప్రధాని కావడం కూడా అదే తొలిసారి. అయినా తెలుగు వాడు కావడంతో ఆయనపై అప్పటి నాయకులకు కొంత చిన్న చూపు ఉండేదని చెబుతారు. కానీ పాలనలో ఆయనకున్న పట్టు చూసి చాలా మంది ఆశ్చర్యపోయేవారట. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మెజారిటీ లేని ప్రభుత్వాన్ని విజయవంతంగా ఐదేళ్లు నడిపించి అపర చాణిక్యుడిగా పేరు తెచ్చుకున్నారు. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలోనే దౌత్య సంబంధాలు మెరుగు పరిచారు. ఇజ్రాయెల్, చైనా, ఇరాన్ లతో సత్సంబంధాలు కొనసాగించారు. కశ్మీర్ తీవ్రవాదులను కట్టడి చేసి ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నపాకిస్తాన్ తీరును ఎండగట్టారు. భారత్ కు అత్యంత కీలకమైన అణుబాంబు తయారీ కూడా పీవీ హయాంలోనే జరిగిందని వాజ్ పేయి స్వయంగా వెల్లడించారు.

మన్మోహన్ సింగ్ ను రాజకీయాల్లోకి తెచ్చింది పీవీనే..
1985 నాటికి దేశం ఆర్థికంగా దెబ్బతినడం మొదలైంది. 1991 సమయానికి ఆర్థిక వ్యవస్థ మరింత భయంకరంగా తయారైంది. విదేశాల నుంచి కొనుగోలు చేసిన వస్తువులకు కూడా డబ్బులు చెల్లించలేని పరిస్థితులు వచ్చాయి. ఇలాగే ఉంటె ప్రపంచ దేశాల్లో భారత్ భంగపడే ప్రమాదం ఉందని భావించిన పీవీ ఆర్థిక వ్యవస్థను ఘాడిలో పెట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అప్పటివరకు రిజర్వు బ్యాంకు గవర్నర్ గా ఉన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను రాజకీయాల్లోకి తెచ్చారు. ఆర్థిక మంత్రి బాధ్యతలు అప్పగించి పూర్తి స్వేచ్చని ఇచ్చారు. పీవీ తీసుకున్న ఈ నిర్ణయం వివాదాస్పదమైంది.

అయినా మన్మోహన్ సింగ్ తో తనకు కావలసినట్టుగా పని చేయించుకోవడంలో విజయవంతం అయ్యారు. ఫలితంగా దేశం ఆర్థికంగా శరవేగంగా అభివృద్ధి చెందింది అందుకే పీవీని ఆర్థిక సంస్కరణల పితామహుడంటారు. పీవీ 14 భాషల్లో మాట్లాడగలరు. పీవీ ఏ దేశంలో పర్యటిస్తే ఆ దేశ ప్రధానులను వారి భాషలో పలకరించి ఆశ్చర్యపరిచేవారట. 1983 అలీన దేశాల సదస్సుకు హాజరైన పీవీ స్పానిష్ భాషలో అనర్గళంగా మాట్లాడి అప్పటి క్యూబా అధ్యక్షుడు ఫీడెల్ కాస్ట్రో‌ను ఆశ్చర్యపరిచారు. ‘ఇన్ సైడర్’ పేరుతో అయన రాసుకున్న ఆత్మకథ భారత రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. ఎంతటి శిఖరాలు అధిరోహించినా ఆయనకు సొంత రాష్ట్రంపై ఎంతో మమకారం ఉండేది. ఓసారి హైద్రాబాద్ వేదికగా మాట్లాడుతూ.. ‘ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే’ అని ఆయన చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి.

పీవీపై వచ్చిన విమర్శలు..
అయితే పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో కొన్ని తీవ్రమైన విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. 1992 లో బాబ్రీ మసీదు కూల్చివేతను కనీసం అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదని పీవీపై వచ్చిన విమర్శలు రాజకీయ జీవితంలో ఒక మచ్చగా మిగిలిపోయాయి. అయితే ఆ సమయంలో పీవీ మౌనం వహించడానికి బలమైన కారణాలే ఉన్నాయని చెబుతారు. పీవీ ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని కోర్టుల చుట్టూ తిరిగారు. తర్వాత వాటిని నిరాధారమైనవిగా కోర్టు కొట్టివేసింది. జీవితకాలం ఎంతో నిరాడంబరంగా బతికిన పీవీ 2004 డిసెంబర్ 23న కన్నుమూశారు. అధికారాన్ని వ్యక్తిగత అవసరాల కోసం ఎన్నడూ ఉపయోగించుకోలేదు. తన పిల్లలను సైతం ప్రధాని కార్యాలయానికి రానివ్వని నిజాయితీపరుడు ఆయన. దేశానికి ఇంత సేవ చేసినా పీవీకి తగిన గౌరవం లభించలేదనేది ఇప్పటికీ వినిపిస్తున్న వాదన.

Related News