తెలంగాణ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి. తెలంగాణలో కేసీఆర్‌కు ప్రత్యామ్నాయం ఎవరని చూస్తే ముందు వరుసలో కనిపిస్తారు రేవంత్. తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రసిడెంట్‌గా, మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం పీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే, కేవలం రెండేళ్ల క్రితమే పార్టీలోకి వచ్చిన జూనియర్ అయిన రేవంత్ రెడ్డికి ఈ పదవి ఇవ్వొద్దని కాంగ్రెస్ సీనియర్లు అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో పీసీసీ అధ్యక్ష పదవి రేసులో దగ్గర వరకు వచ్చి ఆగిపోయారు రేవంత్ రెడ్డి. అయితే, పీసీసీ పదవి రాకపోయినా ఇంకా స్పీడ్‌గా ముందుకెళ్తున్నారు రేవంత్. రెట్టించిన ఉత్సాహంతో తన పని తాను చేసుకుంటూ వెళుతున్నారు. స్వంతంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లి వేరే పార్టీ పెడతారనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగుతోంది.
ఈ క్రమంతో బెంగళూరులో జరిగిన ఈ ఆసక్తికర పరిణామం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమైంది. ఇటీవల కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ కూతురు ఐశ్వర్య వివాహం బెంగళూరులో జరిగింది. ఈ వివాహ రిసెప్షన్‌కు రేవంత్ రెడ్డితో పాటు డీకే శివకుమార్‌కు సన్నిహితులైన పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా వెళ్లారు.
ఇదే ఫంక్షన్‌కు కాంగ్రెస్ ముఖ్య నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా హాజరయ్యారు. వేడుకలో తెలంగాణ కాంగ్రెస్ నేతలను చూసిన ప్రియాంక వారితో మాట్లాడారు. వీరికి కొంత దూరంలో రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డిని చూసిన ప్రియాంక ఆయనను పిలిచి మాట్లాడటంతో అక్కడున్న కాంగ్రెస్ నేతలు షాక్ తిన్నారని తెలుస్తోంది.
ఆ తర్వాత తిరిగి వెళుతున్న సమయంలో కారు ఎక్కిన తర్వాత కూడా తన సిబ్బందితో రేవంత్ రెడ్డిని పిలిపించుకున్న ప్రియాంక గాంధీ ఆయనతో కొంత సేపు చర్చించారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి తెలంగాణలో నిర్వహించిన పాదయాత్ర, రైతు సమస్యలు, తెలంగాణ రాజకీయాలపై ఆమె రేవంత్‌తో మాట్లాడారని సమాచారం. ఈ మొత్తం సీన్‌ను టీకాంగ్రెస్ నేతలు ఆసక్తితో గమనించారట. కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి ప్రియాంక గాంధీ దృష్టిలో పడటం, పిలిపించుకొని మాట్లాడే గుర్తింపు ఎలా దక్కిందనేది వారికి అంతుచిక్కడం లేదట. ఈ పరిణామంతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడతారనే ప్రచారం ఉత్తిదేనని తేలిపోయింది.