ప్రస్తుతం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతున్నందున చాలా మంది వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. అయితే, వ్యాక్సిన్ వేయించుకున్నాక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. ఇందుకు సంబంధించి వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకున్నాక కొన్నింటికి దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. ముఖ్యంగా తినే ఆహారంపై జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
కరోనా వ్యాక్సిన్ వేసుకోకముందు ఒక వారం నుంచి, వేసుకున్న తర్వాత ఒక వారం వరకు మద్యానికి దూరంగా ఉండటం మంచిది. నిజానికి, వ్యాక్సిన్ తీసుకునే వారు ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలని ఎటువంటి నిబంధనను పెట్టలేదు. కాకపోతే, వ్యాక్సిన్ తీసుకున్నాక జ్వరం వంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. మద్యం సేవిస్తే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గవు. ఒక్కోసారి తీవ్రంగా మారి అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది. సిగరేట్లకు కూడా దూరంగా ఉంటేనే మంచిదని వైద్యులు చెబుతున్నారు.
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఒళ్లు నొప్పులు, జ్వరం, అలసట వంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కాబట్టి, వ్యాక్సిన్ వేయించుకున్నాక బాగా విశ్రాంతి తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ పూర్తిగా తగ్గుతాయని అంటున్నారు. ఖాళీ కడుపుతో వ్యాక్సిన్ తీసుకోవద్దని, ఏదైనా తేలికపాటి ఆహరం తిన్న తర్వాత వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు.
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కనీసం ఒక వారం పాటు మనం తినే ఆహారంపై జాగ్రత్తలు తీసుకోవాలి. చెక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు, ప్రాసెస్డ్ ఫుడ్‌కు దూరంగా ఉండటం చాలా మంచిది. తేలికగా జీర్ణమయ్యే ఆహారం, పండ్లు, ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు తింటే మంచిది. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత జ్వరం వస్తే పారాసెటమాల్ వేసుకోవచ్చు. జ్వరం, ఇతర సైడ్ ఎఫెక్ట్స్ రెండు రోజుల్లో తగ్గిపోతాయి. వారం పాటు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి.