logo

  BREAKING NEWS

8 గంట‌ల కంటే ఎక్కువ ప‌ని చేయ‌డం ఎంత డేంజ‌రో తెలుసా ?  |   53 మంది మహిళా ఖైదీలకు సీఎం జగన్ శుభవార్త!  |   బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల: గ్రేటర్ ప్రజలపై వరాల జల్లు!  |   ఎడ‌మ చేతివాటం ఎందుకు వ‌స్తుంది ? వారిలో తేడా ఏముంటుంది ?  |   ఏబీ వెంకటేశ్వర్ రావుకు సుప్రీంలో షాక్..!  |   జ‌గ‌న‌న్న తోడు.. పేద‌ల‌కు రూ.10 వేలు.. ఇలా పొందాలి  |   ‘దమ్ముంటే కూల్చరా’.. అక్బరుద్దీన్ కు బండి సంజయ్ సవాల్!  |   మేయర్ పీఠాన్ని దక్కించుకోగానే వారిని తరిమికొడతాం .. పాతబస్తీపై బండి సంచల వ్యాఖ్యలు  |   కరోనా సెకండ్ వేవ్: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!  |   మహిళల భద్రతకు ‘అభయం’ యాప్.. ఎలా పనిచేస్తుంది? ప్రత్యేకతలేమిటి?  |  

క‌రోనా ప్ర‌భావం త‌గ్గించుకునేందుకు ఈ జాగ్ర‌త్త‌లు తీసుకోండి

క‌రోనా వైర‌స్ ప్ర‌భావం, ప్ర‌జ‌లు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లపై ఎప్ప‌టిక‌ప్పుడు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు ఆంధ్ర‌ప్ర‌దేశ్ కోవిడ్ – 19 స్టేట్ నోడ‌ల్ ఆఫీస‌ర్ డాక్ట‌ర్ అర్జా శ్రీకాంత్‌. ప్ర‌స్తుతం యువ‌త క‌రోనా ప‌ట్ల నిర్ల‌క్ష్యంగా ఉంటున్నార‌ని, నిర్ల‌క్ష్యం వీడ‌క‌పోతే ఇంట్లో పెద్ద వాళ్ల‌కు ప్ర‌మాద‌మ‌ని ఆయ‌న చెబుతున్నారు. క‌రోనా ప‌ట్ల సొంత వైద్యం మానుకోవాల‌ని చెబుతున్న ఆయ‌న క‌రోనాపైన ప్ర‌జ‌ల‌కు కీల‌క సూచ‌న‌లు చేశారు.

కోవిడ్-19 వైరస్ తీవ్రత మెజార్టీ కేసుల్లో మరీ అంత ప్రాణాంతకమైనది ఏం కాదు. అయితే ఆ వైరస్ వివిధ దశల్లో చూపే ప్రభావాన్ని ప్రజలు అంచనా వేయలేక ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని వైద్య నిపుణులు అంటున్నారు. మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం లాంటి అంశాల్లో అవగాహన వచ్చినప్పటికీ లక్షణాలను గుర్తించడం, వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం, సకాలంలో ఆస్పత్రులకు వెళ్లే విషయాల్లో నిర్లక్ష్యంగా ఉంటున్నారు.

మరీ ముఖ్యంగా లాక్‌డౌన్‌ సడలింపుల తరువాత యువత బయట తిరగడం, మాస్కులు లేకుండా వాహనాలపై ముగ్గురేసి ప్రయాణించడం కూడా కోవిడ్ వ్యాధి విస్తృతికి కారణమవుతోందని నిపుణులు అంటున్నారు. మన ద‌గ్గ‌ర నమోదైన కేసుల్లో 40ఏళ్ల లోపు వారు 55 శాతం మంది ఉన్నారని.. యువత మరింత అప్రమత్తంగా ఉండడం వల్ల వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో కోవిడ్ లక్షణాలు ఉంటే ఫలానా మందులు వాడండి, ఫలానా కషాయం తాగండి అని సోషల్ మీడియాలో వస్తున్న వాటిని పాటించి సమస్యను కొని తెచ్చుకుంటున్నారు. అందుకే కోవిడ్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

కోవిడ్ పరీక్షలకు వెళ్లని యువత
ఇటీవల కాలంలో యువత ఉపాధి, ఉద్యోగాల కోసం బయట తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే యువత వైరస్‌ బారిన పడుతున్నారు. అదే సమయంలో మరికొందరు యువకులు బయట తిరిగే సమయంలో మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. యువతలో ఎక్కువ మందికి వైరస్ అనుమానిత లక్షణాలు కనిపించడం లేదు. ఒకవేళ లక్షణాలు కనిపించినా నిర్ధారణ పరీక్షలకు వెళ్ల‌డం లేదు. ఈ నిర్లక్ష్య ధోరణి వల్ల రక్తపోటు, మధుమేహం లాంటి దీర్ఘకాల వ్యాధులున్న కుటుంబంలోని పెద్దలకు వైరస్‌ త్వరగా వ్యాపిస్తున్నట్టు గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు.

జ్వరం వస్తే అశ్రద్ధ వద్దు
ఓ వైపు కోవిడ్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంటే.. మరోవైపు సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో దగ్గు, జలుబు, జ్వరం సాధారణమే అయినప్పటికీ ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండకూడదు. రోజుల తరబడి జ్వరంతో బాధపడుతున్న వారు ఊపిరాడని స్థితిలో మాత్రమే ఆస్పత్రులకు వెళ్తున్నారు. ఆ సమయంలో వైరస్ శాతం అధికంగా ఉండటం, ఊపిరితిత్తులు చాలా వరకు దెబ్బతినటం వల్ల వారిని కాపాడటం చాలా కష్టమవుతోందని వైద్యులు చెబుతున్నారు. ప్రాణనష్టం జరిగిన కేసుల్లో అధిక శాతం ఇలాంటి నిర్లక్ష్యమే కారణంగా చెప్తున్నారు. అందుకే జ్వరం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి.

లక్షణాలుంటే వెంటనే కోవిడ్ టెస్ట్ లకు వెళ్లండి- నిర్లక్ష్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు
ఇప్పటికీ అనేక మందికి కోవిడ్ లక్షణాలు ఉన్నా పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు రావడం లేదు. లక్షణాలు తీవ్రమైనపుడు, శ్వాస తీసుకోవడంలో తీవ్ర‌ ఇబ్బంది కలిగినపుడు మాత్రమే వైద్యులను సంప్రదిస్తున్నారు. పరిస్థితులు తీవ్రమై టెస్టు చేయించే సరికి ఆలస్యమై చికిత్స అందకుండానే ప్రాణాలు పోతున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. అందుకే కోవిడ్ లక్షణాలు కనిపించగానే నిర్లక్ష్యంగా ఉండకుండా వెంటనే కోవిడ్ టెస్టులు చేయించుకోండి లేదంటే స్థానికంగా ఉండే ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులను సంప్రదించండి.

సొంతంగా చికిత్స వద్దు
ప్రస్తుతం చాలా మంది కోవిడ్ కు సంబంధించిన వైద్యం అంటూ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న విషయాలను పాటిస్తున్నారు. ముఖ్యంగా దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే సొంత వైద్యం చేసి కొన్ని రోజుల పాటు ఇంటి వద్దే కాలయాపన చేస్తున్నారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. ముందు నిర్ణయం కోవిడ్ నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ధైర్యంగా ఉందాం-కోవిడ్ ను ఎదుర్కొందాం
కోవిడ్ బారినపడిన వారిలో అధికశాతం మంది మానసిక ఆందోళన, ఒత్తిడి, భయం వంటి లక్షణాల కారణంగా చనిపోతున్నారు. కోవిడ్ నన్నేమీ చేయలేదు అనే గుండెనిబ్బరం ఉన్నవారు అత్యంత క్లిష్టపరిస్థితుల్లోకి వెళ్లినా తిరిగి కోలుకుంటున్నారు. అందుకే మానసికంగా ధృడంగా ఉన్నవారు కోవిడ్ బారి నుంచి కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఆవిరి పట్టుకోవడం- వేడినీరు, ఉప్పు లేదా బెటాడిన్ తో పుక్కిలించండి
కోవిడ్ బాధితులు పసుపు, జండూబామ్, జిందా తిలిస్మాత్ లేదా బ్రీత్ ఈజీ మాత్రలు వేడి నీటిలో వేసి ఆవిరి పట్టటం వలన ఊపిరితిత్తుల సమస్య చాలా వరకు తగ్గి ప్రాణాపాయ స్థితి నుండి బయటపడుతున్నారని వైద్య నిపుణులు కూడా నిర్ధారించారు. చాలా మంది వైద్యులు కూడా ఆవిరి పట్టుకోవడాన్ని చికిత్సలో భాగంగానే చూడాలని చెప్తున్నారు. అదే సమయంలో ఇంటి నుండి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ వేడి నీటిలో ఉప్పు వేసి గానీ, బెటాడిన్ గార్గిల్ ద్రావణాన్ని ఒక మూతకు 2 మూతల వేడి నీటితో కలుపుకుని ఉదయం, సాయంత్రం పుక్కిలిస్తే వైరస్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువంటున్నారు. వైరస్ బారిన పడిన వారు కూడా కోవిడ్ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చంటున్నారు.

వేడి పదార్థాలు తీసుకోవడం మంచిది
కోవిడ్ వ్యాప్తి కొనసాగుతున్న ఈ పరిస్థితుల్లో ప్రజలంతా వీలైనన్ని సార్లు వేడి నీరు, గ్రీన్ టీ, అల్లం టీ తీసుకోవడం, ఆహార పదార్థాలు వేడివేడిగా ఉన్నప్పుడే తీసుకుంటే మంచిది. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచిన ఆహార, పానీయాలను తీసుకోవటం ఎంత మాత్రం మంచిది కాదని సూచిస్తున్నారు.

వైద్యం మరియు కౌన్సిలింగ్ చాలా అవసరం
చాలా మంది వాట్సప్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వేదికగా వస్తున్న సమాచారం ఆధారంగా సొంత నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదకరం. కరోనా గురించి అనుమానాలున్నా, కోవిడ్ సోకినా తప్పనిసరిగా నిపుణుల సలహాలు, కౌన్సిలింగ్ తీసుకోవాలి. తదనుగుణంగానే మందులు వాడాలి.
ఇందుకోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం కూడా 104, 1902 కాల్ సెంటర్లతో పాటు ఆన్ లైన్‌లో వైద్య సహాయం పొందడానికి వైఎస్ఆర్ టెలీమెడిసిన్ 14410 నంబర్, 8297104104 హెల్ప్ లైన్ నంబర్ ను అందుబాటులో ఉంచింది. ఈ నంబర్లకు కాల్ చేసి కోవిడ్ కు సంబంధించిన సమాచారంతో పాటు ఆస్పత్రుల వివరాలు కూడా తెలుసుకోవచ్చు. కోవిడ్‌ నాకు రాదు అని నిర్లక్ష్య ధోరణి వదిలి, ప్రత్యేకంగా యువత తగు జాగ్రత్తలు వహించి నట్లయితే వారినే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా కోవిడ్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

Related News