బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారాడు ప్రభాస్. ఇదే సమయంలో కేజీఎఫ్ సినిమాతో టోటల్ ఇండియాను తన వైపు తిప్పుకున్నాడు కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. దర్శకుల్లో ప్రశాంత్ నీల్, హీరోల్లో ప్రభాస్‌కు ఇప్పుడు ఇండియా వైడ్ క్రేజ్ ఉంది. అలాంటిది ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా అంటే ఇక సినీ ప్రేమికులకు పండుగ లాంటిదే. అలాంటిది వీరిద్దరూ కలిసి పాన్ ఇండియా మూవీ తీస్తున్నారనే వార్త ఇప్పుడు ఇద్దరి అభిమానులకు గుడ్ న్యూస్‌గా మారింది.
అవును, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా మూవీ తెరకెక్కడం ఇక లాంఛనమే. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ఈ సినిమాకు సంబంధించి అనేక విశేషాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చే సినిమా కొత్త స్టోరీ కాదని తెలుస్తోంది. ఉగ్రమ్ అనే ఓ కన్నడ సినిమా రీమేక్‌గా ఈ సినిమా తీస్తున్నారని సమాచారం. 2014లో కన్నడలో ఉగ్రమ్ సినిమా విడుదలైంది.
అప్పట్లో ఈ సినిమా కన్నడనాట సంచలనం సృష్టించింది. ఈ సినిమా ట్రైలర్ చూసే మిగతా భాషల హీరోలు ఈ సినిమాను రీమేక్ చేయాలని అనుకున్నారు. కేవలం 4 కోట్లతో నిర్మించిన ఈ సినిమా రూ.50 కోట్లు వసూలు చేసి కన్నడనాట బిగ్ సక్సెస్ సాధించింది. దీంతో మిగతా భాషల హీరోలు ఈ సినిమాపై కన్నేశారు. అప్పట్లో రామ్ చరణ్ తేజ్, జూనియర్ ఎన్టీఆర్ తెలుగులో ఉగ్రమ్ సినిమాను రీమేక్ చేస్తారని ప్రచారం సాగింది.
కానీ, ఆరేళ్లుగా ఉగ్రమ్ రీమేక్ ముందుకు సాగడం లేదు. ఇప్పుడు ఈ సినిమాకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఉగ్రమ్ తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు ప్రభాస్‌తో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే ప్రభాస్‌కు కథ వినిపించగా, ప్రభాస్‌కు నచ్చింది. అయితే, ఇప్పటికే కన్నడలో ఈ సినిమా హిట్ కావడం, కథ ఆరేళ్ల కిందది కావడం వల్ల కొన్ని మార్పులతో ఇప్పుడు రీమేక్ చేయాలని దర్శకుడు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
బాహుబలి తర్వాత ప్రభాస్‌తో సినిమా అంటేనే ఇండియావైడ్‌గా భారీ అంచనాలు ఉంటాయి. ఇక, ప్రశాంత్ నీల్ డైరెక్టర్ అంటే మరింత ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలిసిన కథనే మళ్లీ తీయాలనుకోవడం మాత్రం రిస్క్ అనే అభిప్రాయాలు వస్తున్నాయి. అయితే, ప్రభాస్‌కు సరిగ్గా సరిపోయే కథ అయినందునే కొత్త కథ కాకుండా ఉగ్రమ్ రీమేక్ వైపు మొగ్గు చూపారని చెబుతున్నారు. కాగా, ఈ రీమేక్‌ను కన్నడలో ఉగ్రమ్ సినిమా నిర్మించిన హోంబలే ఫిలింస్ వారే నిర్మిస్తున్నారు.