కేరళ రాష్ట్రం పాలక్కడ్ జిల్లాలో గర్భిణీ ఏనుగు మృతి చెందడం పై దేశమంతా కంట తడి పెడుతుంది. ఏనుగు మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏనుగు పోస్టుమార్టం నివేదికను సమర్పించారు వైద్యులు. పేలుడు పదార్తాలు కలిగిన పైనాపిల్ ను తినడం వల్లనే ఏనుగు నోటిలో తీవ్ర గాయాలైనట్టుగా నివేదికలో వెల్లడైంది. అయితే ఏనుగు నోపితో అలమటిస్తూ 14 రోజుల పాటు ఆహారం తీసుకోలేదని ఒక రోజు మొత్తం నదిలోనే ఉండిపోయిందని తెలిపారు. అయితే ఏనుగు మరణించడానికి ఊపిరితిత్తుల వైఫల్యమే కారణమని పోస్టుమార్టం నివేదికలో వైదులు పేర్కొన్నారు.
ఈ ఘటనపై స్పందించిన కేరళ వన్యప్రాణి సంరక్షణ అధికారి సురేంద్ర కుమార్ స్పందిస్తూ.. మే 23న స్థానికులు ఏనుగుని గుర్తించారు. ఆ తర్వాత అడవిలోకి వెళ్లిన ఏనుగు మళ్ళీ మే 25 న తిరిగి వెల్లియర్ నదిలోకి వచ్చింది. చనిపోవడానికి ఒక రోజు ముందు మొత్తం నదిలోనే ఉండిపోయింది అని తెలిపారు. కానీ ఏనుగుకు పైనాపిల్ లో పేలుడు పదార్థాలు తినిపించడం కష్టమని, అడవి ఏనుగు దగ్గరకు వెళ్ళడానికి ఎవరు సాహసించారని అయన సందేహం వ్యక్తం చేసారు.
దేశవ్యాప్తంగా ఏనుగు మృతిపై నిరసనలు వెల్లువెత్తడంతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ ఘటనపై స్పందించారు. ఏనుగు మృతికి కారణమైన ముగ్గురు అనుమానితులని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపిస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.