యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ పై జూబ్లీహిల్స్ పోలీసులు చర్యలకు సిద్ధమవుతున్నారు. ఇటీవల జస్వంత్ తాగి కారు నడుపుతూ ప్రమాదానికి కారణమైన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు జస్వంత్ ను అదుపులోకి తీసుకుని ఆ తర్వాత బెయిల్ పై వదిలిపెట్టారు. కాగా జస్వంత్ పై ఇప్పటికే ఐపీసీ సెక్షన్ 337, 279, కింద కేసులు నమోదు చేశారు. ‘
తల్లిదండ్రలతో కలిసి కౌన్సెలింగ్ కు హాజరుకావాలని నోటీసులు కూడా జారీ చేశారు. అయితే పోలీసుల నోటీసులను జస్వంత్ లెక్క చేయకుండా కౌన్సెలింగ్ కు డుమ్మా కొట్టాడు. దీంతో సీరియస్ అయిన పోలీసులు జస్వంత్ పై చర్యలు తీసుకోనున్నారు. సాఫ్ట్ వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ తో షణ్ముఖ్ జస్వంత్ మంచి క్రేజ్ ను సంపాదించుకున్న విషయం తెలిసిందే.
ఆ తర్వాత ఇటీవల సూర్య అనే వెబ్ సిరీస్ లో నటిస్తుండగా ఈ సిరీస్ కు కోట్లలో వ్యూస్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ టీవీ కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నాడు. ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10 లో ప్రయాణిస్తున్న షణ్ముఖ్ కారు రెండు బైకులను, రెండు కార్లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో బ్రీత్ ఎనలైజర్ లో పరీక్షించగా రీడింగ్ ఏకంగా 170 కి చేరింది.